వ్యవసాయ సహకార పరపతి సంఘాలను (పీఏసీఎస్) సంస్కరించే ప్రతిపాదనల్లో భాగంగా సంఘాల సంఖ్యను పెంచడంతోపాటు మరింత మందికి సభ్యులుగా చేరే అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు (ఆర్‌బీకే) ఆర్థిక సేవలు అందించే వనరులుగా పీఏసీఎస్‌లను మార్చనుంది. సహకార సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున.. ఆ లోపే ఈ సంస్కరణలు చేపట్టాలా? తర్వాతా? అన్న అంశాన్ని ఆ శాఖ పరిశీలిస్తోంది. వచ్చే వారంలో దీనిపై స్పష్టత రానుంది.
ఇవీ ప్రతిపాదనలు
- రాష్ట్రంలో ప్రస్తుతం 2,051 సహకార పరపతి సంఘాలున్నాయి. వీటిలో అధిక భాగం పంట రుణాలకే పరిమితమవుతున్నాయి. ఇతర రుణాల్లో రాజకీయ జోక్యం అధికంగా ఉంది. మొత్తంగా పీఏసీఎస్‌లు రాజకీయ పరపతి కేంద్రాలుగా మారాయన్న విమర్శలున్నాయి. మొత్తం సంఘాల్లో 45% పైగా నష్టాల్లోకి చేరడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసిన సిఫార్సుల మేరకు సహకార సంఘాల్లో సంస్కరణలకు ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకింగ్ తదితర రంగాల్లోని నిపుణుల్ని నియమించనుంది.
- ప్రస్తుతం షేరుధనం, డిపాజిట్ల ప్రాతిపదికనే పీఏసీఎస్‌లలో సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. వీటిని గ్రామ సచివాలయాలకు చేరువ చేయడం ద్వారా సభ్యుల సంఖ్యను భారీగా పెంచాలన్నది ప్రతిపాదన. సంఘాల ద్వారా సేవలు పొందే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించనున్నారు. పంట ఉత్పత్తుల్ని అమ్మే రైతులతోపాటు గోదాముల్లో సరకు నిల్వ చేసే వారికీ సభ్యత్వం ఇవ్వనున్నారు. తద్వారా కౌలు రైతులూ పీఏసీఎస్‌లలో చేరే సౌలభ్యం ఉంటుంది.
- గ్రామ సచివాలయాల స్థాయిలో సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా వీటి విస్తృతి పెరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,600 పైగా రైతు భరోసా కేంద్రాలున్నాయి. ప్రతి మూడు కేంద్రాలకు ఒక పీఏసీఎస్ చొప్పున కనీసం మూడు వేలకు పైగానే పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొత్తగా కనీసం వెయ్యి సంఘాలు ఆవిర్భవించనున్నాయి. కొత్త వాటిలో సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి