జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను మంగళగిరిలో బుధవారం జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ‘అమరావతి విషయంలో జనసేన ఏ రోజూ వెనకడుగు వేయలేదు. మా విధానం స్పష్టంగానే ఉంది. న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశాం. ఉద్యమ కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. దిల్లీ వెళ్లినప్పుడు ఇక్కడి మహిళలు, రైతులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన విషయాలను ఫొటోలతో సహా కేంద్ర నాయకత్వానికి తెలియజేశాం. భాజపా అగ్రనాయకత్వం అమరావతినే రాజధానిగా చూస్తున్నామని చెప్పింది. రాష్ట్ర నాయకత్వం తీర్మానం చేసింది. గతంలో రాజధాని కోసం లాంగ్‌మార్చ్ చేయాలనుకున్నా దురదృష్టవశాత్తూ అది జరగలేదు. కరోనా కారణంగా మా వైపు నుంచి వేగంగా ముందుకు వెళ్లలేకపోయాం. 365 రోజులే ఉద్యమం చేస్తామని డెడ్‌లైన్ పెట్టుకోకుండా కొనసాగించాలి’ అని పేర్కొన్నారు. రాజధాని మహిళల ఉద్యమంలో జనసేన భాగస్వామ్యం కావాలని కోరారని, కచ్చితంగా అండగా పార్టీ నిలబడుతుందని స్పష్టం చేశారు.
పోలీసు కంచెలు దాటి నడిచా..
‘రాజధాని కోసం నా చెప్పులు తెగినా పోలీసు కంచెలు దాటుకుంటూ మరీ నడిచా. రైతులు రాష్ట్రం కోసం భూములిచ్చారే తప్ప ఒక పార్టీకి కాదు. ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధానిని మార్చడానికి వీలు లేదు..’ అని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. బంగారం ధరించి ఎవరైనా ఉద్యమం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారని.. ఏం చేయకూడదా? చిరిగిన బట్టలతోనే ఉద్యమం చేయాలా అంటూ వైకాపా నాయకుల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘అమరావతి రాజధాని కేవలం ఒక కులానిదే అన్న మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పి ఉంటే బాగుండేది. మూడు రాజధానులు అంటూ నీరుగారుస్తున్నారే తప్ప అమరావతిలో రాజధాని ఉండదని చెప్పడం లేదు. రాజధానికి నన్ను రమ్మని పిలిచింది దళిత రైతులే. నాడు ఉద్దండరాయునిపాలెం దళిత రైతులను అడిగినప్పుడు రాజధాని కోసం ఇష్టపడే భూములను ఇస్తున్నామని చెప్పారు.. అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
అక్రమ నిర్బంధం వ్యాజ్యాల్లో విచారణ వాయిదా వేయడం కుదరదు: హైకోర్టు