రాజధాని గ్రామాల్లో 352వ రోజు ఉద్యమ నినాదం ఊపందుకుంది. 29 గ్రామాల్లో రైతులు పచ్చజెండాలు చేతబూని అమరావతి నినాదాలతో హోరెత్తించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో రైతులు తమ ఆకాంక్షను బలంగా వెల్లడించేందుకు వివిధ మార్గాల్లో శాంతియుతంగా తమ నిరసనను ప్రకటించారు. కృష్ణాయపాలెంలో రైతులు చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో రైతులకు బేడీలు వేయటాన్ని నిరసిస్తూ... మహిళలు, అన్నదాతలు సంకెళ్లు వేసుకొని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
మందండంలో మూడు రాజధానులకు మద్దతుగా కొందరు వ్యక్తులు ఆందోళన శిబిరాన్ని నిర్వహించారు. వీరికి ప్రతిగా...అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రుల దిష్టి బొమ్మలను శిబిరం ముందు పెట్టి రైతులు నిరసన తెలిపారు. మిగిలిన గ్రామాల్లోనూ రాజధాని ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. తమ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాల్సిన ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఉద్ధండరాయునిపాలెంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. అమరావతిని కాపాడుకునేదాక తమ ఉద్యమం కొనసాగుతుందన్న రైతులు... అప్పటివరకు ఎన్ని కష్టాలైనా భరిస్తామని స్పష్టం చేశారు.
మరో రెండు వారాల్లో ఉద్యమానికి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారీగా ఆందోళన చేపట్టాలని రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదీచదవండి