ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి మధ్యప్రదేశ్‌లోని సులియారిలో ఉన్న బ్లాక్‌లో.. తవ్వితీసే బొగ్గును అదానీ పవర్ కొనుగోలు చేసేలా టెండరు దక్కించుకుంది. నాలుగు సంస్థలు బిడ్ దాఖలు చేయగా, ఇందులో అదానీ పవర్ బేసిక్ ధర కంటే 1% అధిక మొత్తానికి కోట్ చేసి బిడ్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. సులియారిలోని 1,298 హెక్టార్ల బొగ్గు బ్లాక్‌ను 2018లో కేంద్రం ఏపీఎండీసీకి కేటాయించింది. ఇందులో 108.91 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.
ఇందులో బొగ్గు తవ్వి తీసి, మైన్ నిర్వహించే టెండరును గతంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. వివిధ అనుమతులు రావడంతో కొద్దిరోజుల కిందట ఈ బ్లాక్‌లో తవ్వకాలు ఆరంభించారు. ప్రస్తుతం గనిలో పైన మట్టి తొలగిస్తున్నారు. వచ్చేనెల నుంచి బొగ్గు తవ్వకాలు మొదలు కానున్నాయి. ఇక్కడ ఏటా 5 మిలియన్ టన్నులు తవ్వి తీస్తారు. ఇందులో 75% వాణిజ్యపరంగా, 25% ఆ రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలకు అమ్మాలి. ఒకవేళ అవి తీసుకోకపోతే, దాన్నీ వాణిజ్యపరంగా అమ్ముకునే అవకాశం కల్పించారు.
75% బొగ్గు వాణిజ్య విక్రయాలకు మూడేళ్ల కాలానికి ఇటీవల టెండర్లు నిర్వహించగా అదానీ పవర్, మరో మూడు సంస్థలు బిడ్లు వేశాయి. గతవారం బిడ్లు తెరవగా.. బేసిక్ ధర కంటే అదనంగా 1% చెల్లించేలా అదానీ పవర్ కోట్‌చేసి టెండర్ దక్కించుకుందని ఏపీఎండీసీ వర్గాలు తెలిపాయి.
అధిక పోటీ లేకుండా నిబంధన
ఈ టెండరులో ఓ కీలక నిబంధన కారణంగా.. బొగ్గు అవసరం ఉన్న అనేక సంస్థలు బిడ్‌లో పాల్గొనలేకపోయాయని తెలిసింది. టెండరు దక్కించుకునే సంస్థ రూ.250 కోట్లు డిపాజిట్ చేయాలనే నిబంధన చిన్న సంస్థలను పోటీకి దూరం చేసిందని సమాచారం. అదానీ, జిందాల్ వంటి 4 సంస్థలే ముందుకొచ్చాయి. ఈ మొత్తానికి ఏపీఎండీసీ వడ్డీ చెల్లించనుంది.
ఇంత భారీ డిపాజిట్ అనే నిబంధన లేకపోతే, టెండరులో మరిన్ని సంస్థలు పాల్గొని ఏపీఎండీసీకి ఇంకా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెండరు దక్కించుకునే సంస్థ బొగ్గును తీసుకొని సకాలంలో డబ్బులు చెల్లించకపోయినా, మధ్యలో ఉపసంహరించుకున్నా రికవరీకి వీలుగా ఇంత మొత్తం డిపాజిట్ చేయాలనే నిబంధన పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.