జిల్లా మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఆసుపత్రిలో పలు వార్డులను పరిశీలించారు. నవజాత శిశువుల మృతిపై ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి రోజూ నియోనేటల్ వైద్య విభాగంలో ఇద్దరు నుంచి నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడటం, ఏటా పదహారు వందలకు పైగా చనిపోతున్న తీరును ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్యుల మధ్య సమన్వయలోపంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.
శనివారం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల కొరతను వైద్యులు మంత్రికి తెలిపారు. వివిధ విభాగాల్లో వైద్యులు విధుల్లో సమయపాలన పాటించని విషయం, సమన్వయంగా పనిచేయని తీరును మంత్రి ఆళ్ల నాని సమీక్షలో లేవనెత్తారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ పనితీరుపైనా ఎమ్మెల్యేలు, మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతపురం ఆసుపత్రిలో వైద్యులు సమస్వయంతో పనిచేయాలని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. ఆసుపత్రి పరిస్థితులపై అధికారుల నుంచి నివేదిక కోరిన మంత్రి నాని, నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు చెప్పారు.
ఇవీ చూడండి : సిరి: యాప్లో క్లిక్ కొట్టు- అప్పు పట్టు!