స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు కమిటీ ఏర్పాటు - presidential order
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 10:16 PM IST
Committee to review presidential order: స్థానికత అంశంపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. స్థానికత ఆధారంగా విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా కోసం సవరణ లేదా కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన పూర్తై పదేళ్లు పూర్తికావొస్తుండటంతో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పదేళ్లపాటు స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు అమలయ్యేలా కేంద్రం విభజన చట్టంలో తెలిపింది.
ఈ గడువు 2024 జూన్ 2 తేదీతో ముగియనుండటంతో ప్రస్తుతం సవరణ లేదా కొత్త ఉత్తర్వుల ప్రతిపాదనల కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్గా 8 మంది ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానికత కోటా అంశంపై విద్యార్ధులు, అసోసియేషన్లు, యూనియన్లు, నిపుణులు, ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది.