YSRCP Leaders Occupying Government Lands in Kadapa: కడపలో ఖాళీ భూమి కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదైనా, ప్రైవేటుదైనా కబ్జా చేయాల్సిందే అన్న రీతిలో వైఎస్సార్సీపీ నాయకులు బరి తెగించారు. తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయాల కోసం కేటాయించిన భూముల్లో 20 ఎకరాలు స్వాహా చేసేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయాలకు 60 ఎకరాలు కేటాయిస్తే ప్రస్తుతం 40 ఎకరాలు మాత్రమే ఉందని అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రెవెన్యూ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యం - ఏకపక్షంగా భూ రికార్డులు తారుమారు
తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయాల కోసం కడప శివారులోని మామిళ్లపల్లె వద్ద 1988లో 60 ఎకరాలు భూమి సేకరించారు. రైతులకు పరిహారం చెల్లించారు. కార్యాలయాలు నిర్మించారు. ఇక్కడే సీఈ కార్యాలయం కూడా ఉంది. ప్రాజెక్టు కార్యాలయాలు, సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ కలిపి 40 ఎకరాల్లో నిర్మాణాలు చేశారు. మిగిలిన 20 ఎకరాలపై వైఎస్సార్సీపీ నేతల కన్ను పడింది. ఆ భూములను అక్రమంగా కాజేసినట్లు తెలిసింది.
దీనికి సంబంధించి మామిళ్లపల్లెకు చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా అసలు విషయం బయటపడింది. 1988లో నోటిఫికేషన్ ప్రకారం 60 ఎకరాల విస్తీర్ణం సర్వే నంబర్లతో సహా జాబితాలో కనిపించింది. సమాచార హక్కు చట్టం ద్వారా భూముల వివరాల్లో కేవలం 40 ఎకరాల 88 సెంట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు సమాధానం ఇచ్చారు. సర్వే నంబర్ 81.1లో 1.31 ఎకరాలు, 81.2 సర్వే నంబర్‌లో 1.40 ఎకరాలు ఇతరుల పేరిట క్రయవిక్రయాలు జరిగినట్లు తేలింది.
దందాలు, దోపిడీల మధ్య నలిగిపోయిన సాగరనగరం - విశాఖను నంజుకుతిన్న వైసీపీ నేతలు
20 ఎకరాల భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు క్రయ, విక్రయాల ద్వారా రిజిస్ట్రేషన్లు జరగడంతో నిషేధిత జాబితాలో కనిపించకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. వైకాపా నాయకులు, సబ్ రిజిస్ట్రార్ అధికారులు కుమ్కక్కై ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది. కడప శివారులో సెంటు భూమి లక్షల రూపాయలు ధర పలుకుతుండటంతో తెలుగు గంగ ప్రాజెక్టు భూములను ఈ ఐదేళ్లులో కాజేసినట్లు బయటపడింది. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపిస్తే కబ్జారాయుళ్ల బండారం బయట పడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
భూముల విషయంలో అడిగి మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టొద్దని అధికారులు అంటున్నారు. మాకు చాలా ఒత్తిళ్లు, ఇబ్బందులున్నాయని రాజకీయంగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. మమ్ముల్ని ఇంతటితో వదిలిపెట్టండని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ వైసీపీ కీలక నేత తాను చూసుకుంటానంటూ అధికారులకు అభయమివ్వడంతో వారు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు.
పంట ఆఖరి దశలో నీటిని నిలిపివేసిన అధికారులు - ఆగ్రహం వ్యక్తం చేసిన రైతన్నలు