YSRCP Govt Neglect on Guntur Channel Extension Works : వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పాపాలు కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను విస్మరించడమే కాక కనీసం కాలువల విస్తరణనూ పట్టించుకోలేదు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులు సకాలంలో నిర్వహించని కారణంగా ఇప్పుడు అంచనాలు పెరిగి సర్కారుపై రూ.176 కోట్ల అదనపు భారం పడింది. గతంలో టీడీపీ మంజూరు చేసిన ప్రాజెక్టుని జగన్ విస్మరించడం వల్లే ఇప్పుడు ప్రజాధనం భారీగా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విస్మరించిన వైఎస్సార్సీపీ సర్కారు : ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు పశ్చిమ డెల్టాకు సాగు నీరందించే కాలువల్లో గుంటూరు వాహిని ఒకటి. ఈ కాలువ ప్రస్తుతం వట్టిచెరుకూరు మండలంలోని గారపాడు వరకే ఉంది. దీన్ని పర్చూరు వరకు మరో 30 కిలోమీటర్లు పొడిగించి ఆయకట్టుకు నీరు అందించాలనే డిమాండ్ 5 దశాబ్దాలుగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వం కాలువ పొడిగింపు, విస్తరణకు వేర్వేరుగా టెండర్లు పిలిచి పనులు కాంట్రాక్టర్లుకు అప్పగించింది. అప్పట్లోనే రూ.378 కోట్ల మంజూరు చేసింది. విస్తరణ పనులు 2019లో ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి. వైఎస్సార్సీపీ వచ్చాక ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. జగన్ సర్కారు ఈ పనులను ఐదేళ్లు పట్టించుకోలేదు.
వంతెనలు లేక వెళ్లలేకపోతున్న రైతులు - బీడుగా మారిన పొలాలు - HLC Bridge Collapse
రూ.176కోట్ల అదనపు భారం : రైతులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా చేపట్టలేదు. 2024లో కూటమి అధికారంలోకి వస్తే గుంటూరు వాహిని, విస్తరణ పొడిగింపు పనులు పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఛానల్ పొడిగింపు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దీనిపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేయగా రూ. 554 కోట్లకు అంచనాలు పెరిగాయి. సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లయితే రూ. 378 కోట్లతోనే కాలువ పనులు పూర్తయ్యేవి. రైతులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి అదనపు భారం తప్పేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆలసత్వం వల్ల ఇప్పుడు రూ. 176 కోట్ల అంచనా వ్యయం అదనంగా పెరిగింది. జగన్ సర్కారు నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని రైతులు వాపోతున్నారు.
ఉప్పొంగుతున్న ఏలేరు- పిఠాపురం నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం - Yeleru Canal Floods
జగన్ నిర్లక్ష్యం వల్లే ప్రజాధనం వృథా : గుంటూరు వాహిని ప్రస్తుతం 600 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండగా దాన్ని 750 క్యూసెక్కులకు పెంచేలా విస్తరించాలనేది ప్రణాళిక. ఇరువైపులా గోడలు నిర్మించడం ద్వారా నీటివృథాకు అడ్డుకట్ట వేస్తారు. కాలువ వెడల్పు 18 మీటర్లకు విస్తరిస్తారు. తద్వారా 350 క్యూసెక్కుల నీరు తీసుకెళ్లవచ్చు. దీనివల్ల గుంటూరు జిల్లాలో కాకుమాను, ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలంతో పాటు బాపట్ల జిల్లాలో పర్చూరు, పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట మొత్తం 38,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నాగార్జునసాగర్ కుడికాలువ కింద మల్లాయపాలెం, కాకుమాను మేజరు కాలువల పరిధిలోని 9,600 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చి స్థిరీకరిస్తారు. ఛానల్ పొడిగింపు ద్వారా సాగునీటితో పాటు తాగునీటి అవసరాలూ తీరతాయి. ఈ పనులు ఆలస్యమయ్యే కొద్దీ వ్యయం పెరుగుతుందని అందుకే వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని నల్లమడ రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గుంటూరు వాహిని ప్రాజెక్టు డీపీఆర్ త్వరగా పూర్తి చేయాలంటున్న రైతులు రాబోయే బడ్జెట్లో కనీసం రూ. 100 కోట్ల దీనికి కేటాయించాలని కోరుతున్నారు.
కృష్ణా పశ్చిమ కాలువకు గండి- పొలాలను ముంచెత్తిన వరద - Crop Fields Submerged in Water