Young Woman Painting with Useless items: విజయవాడ సీతారాంపురానికి చెందిన పంతొమ్మిదేళ్ల రిజ్వాన అందమైన చిత్రలేఖనంలో పాటు వివిధ చిత్ర కళల్లో రాణిస్తోంది. పదునైన సర్జికల్ బ్లేడ్ కాగితాలని అందమైన ఆకృతులుగా తీర్చిదిద్దుతూ పలువురి ప్రశంసలు పొందుతోంది. దేనికీ పనికిరావు అనుకునే వాటిని సైతం అందమైన వస్తువులుగా తీర్చిదిద్దుతూ ఆహా అనిపిస్తోంది. పదునైన సర్జికల్ బ్లేడ్ ఆమె కాగితాన్ని ఆకారానికి తగ్గట్లు కట్ చేయడం చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.
ఆమె ప్రతిభను గుర్తించిన అనేక సంస్థలు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందించాయి. ఎనిమిదో ఏట నుంచే రంగుల లోకంలో విహరించటం నేర్చుకుని మెల్లమెల్లగా తన సృజనాత్మక ఆలోచనలను జతపరుస్తూ అద్భుతమైన పేపర్ కార్వింగ్ వర్క్స్ చేస్తూ వండర్ యూత్ ఐకాన్ అనిపించుకుంటుందీ రిజ్వాన. పువ్వు పుట్టగానే పరిమలిస్తుందనే నానుడికి చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. ఈ బెజవాడ యువతి తండ్రి అబ్దుల్ రియాజ్ వ్యాపారిగా ఉన్నారు. తల్లి అబ్దుల్ రిషాలత్ గృహిణిగా ఉన్నారు. చిన్ననాటి నుంచి తనకు చిత్రలేఖనం, వివిధ అందమైన ఆకృతులను తయారు చేయడం పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు నిత్యమూ ప్రోత్సహిస్తున్నారంటోంది రిజ్వాన.
చిన్ననాటి నుంచి తక కళకు కావాల్సిన అన్ని రకాల సామాగ్రి అడిగిన వెంటనే తెచ్చిపెడతారంటోంది. తన తండ్రీ చిత్రకారుడు కావడం తాను ఈ రంగంలో రాణించడానికి ఎంతో దోహదం చేసిందని రిజ్వన అభిప్రాయపడుతోంది. మొదటి గురువు తండ్రే కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని రిజ్వాన సంతోషం వ్యక్తం చేస్తోంది. రిజ్వాన ప్రస్తుతం విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలో డిగ్రీ (బి.ఎ) విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
చిన్నతనం నుంచి చదువులో రాణిస్తూనే తనలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తికి మెరుగులు దిద్దుకుంటూ ఇంతింతై వటుడింతైనట్టు చాలా ఏకాగ్రతతో సర్జికల్ బ్లేడ్ సహాయంతో ప్రకృతి, పక్షులు, జంతువులు, పూలు, అరబిక్‌తో పాటు జామెట్రీ డిజైన్స్ ఇలా సుమారు 200 వరకు పేపర్ కార్వింగ్ వర్క్స్ పూర్తి చేసింది. తను ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్‌పై పెడుతున్న ఏకాగ్రత తన రెగ్యులర్ స్టడీస్‌కి బాగా ఉపయోగపడుతుందని, తద్వారా మంచి మార్కులు సంపాదించుకో గలుగుతున్నానని రిజ్వాన చెబుతోంది.
అంతేకాదండోయ్ రిజ్వాన క్లే వర్క్స్ చేయటంలోనూ దిట్టే అని చెప్పాలి. చిన్న చిన్న క్లే ముక్కలను ఉపయోగించి పండ్లు, కూరగాయలు వంటివి చేస్తూనే అందమైన ప్రకృతి ఆకృతులనూ మోరల్ ఆర్ట్ టెక్నిక్‌తో త్రీడీలో కళ్లకు కట్టినట్లు రూపొందిస్తోంది. పనికిరావనుకున్న బాటిల్స్‌తో కూడా ఆకర్షణీయమైన కళాకృతులను సృజించిన ఘనత రిజ్వానాది. తమ కుమార్తె తయారు చేసిన వివిధ రకాల అందమైన ఆకృతులను చూస్తూ రిజ్వాన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. తమ కుమార్తెను వివిధ వేదికలపైన వక్తలు పొగుతుంటే తమకు గర్వంగా అనిపిస్తోందని చెబుతున్నారు.
ప్రతిభకు అడ్డురాని పేదరికం - పవర్ లిఫ్టింగ్‌లో శ్రీకాకుళం యువకుడు సత్తా
తన తండ్రి రియాజ్ నుంచి ప్రేరణ పొందుతూ పెన్సిల్ షేడింగ్, పెన్ డ్రాయింగ్, వాటర్/పోస్టర్, ఆక్రలిక్/ఆయిల్ పెయింటింగ్స్లతో పాటు గుజరాతీ స్టైల్లో గ్లాస్ పెయింటింగ్, డేకరేటివ్ వర్క్స్ చేస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నానని రిజ్వానా చెబుతున్నారు. భవిష్యత్తులో ఓ ఆర్ట్ స్కూల్‌ని స్థాపించి పేద విద్యార్థులకు చిత్రలేఖనం, అందమైన ఆకృతుల తయారి వంటివి నేర్పిస్తానని రిజ్వానా అంటోంది. సర్జికల్ బ్లేడ్‌తో కాగితాలను కట్ చేసేటప్పుడు చాలా ఏకాగ్రత అవసరం అంటోంది. ఏ మాత్రం అదుపు తప్పినా చేతికి గాయం అవుతోందని అంటోంది.
"చిన్నప్పటి నుంచీ నాకు రంగులంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో డ్రాయింగ్ వేయటం స్టార్ట్ చేశాను. చిత్ర లేఖనంలో రాణించాడనికి అవసరమైన సామాగ్రి అన్నీ చిన్నప్పటి నుంచీ నా తల్లిదండ్రులు తెచ్చిపెడుతున్నారు. వారి ప్రోత్సాహంతోనే నేను చిత్రలేఖనం, అందమైన ఆకృతులను తయారు చేయటంలో ఈ స్థాయికి చేరుకున్నాను. భవిష్యత్తులో ఓ ఆర్ట్ స్కూల్‌ని స్థాపించి పేద విద్యార్థులకు చిత్రలేఖనం, అందమైన ఆకృతుల తయారి వంటివి నేర్పించాలని అనుకుంటున్నాను. " - అబ్దుల్ రిజ్వాన, కళాకారిణి
పనికిరాని వస్తువులతో కళాఖండాలు సృష్టిస్తున్న యువతి- కాగితాలతో చేసిన ఆకృతులు చూస్తే మతిపోవాల్సిందే! (ETV Bharat)