YCP Leaders Doing Fraud in Nomination : ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను అయోమయానికి గురిచేసే విధంగా కూటమి నేతల పేర్లున్న వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెడుతున్నారు. తాజాగా కూటమి అభ్యర్థిగా మచిలీపట్నం లోక్‌సభ బరిలో దిగిన ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. సీహెచ్.బాలశౌరి, బాలశౌరమ్మ అనే పేర్లున్న ఇద్దరిని వెతికి పట్టుకుని తెచ్చి తన మందీ మార్భలాన్ని దగ్గరుంచి మరీ మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి వారితో నామినేషన్లను దాఖలు చేయించారు.
ఓటమి భయంతో వైసీపీ అడ్డదారులు : లోక్‌సభకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది. స్క్రూట్నీ(Nominations Scrutiny) నేపథ్యంలో పేర్ని నాని పీఏ శ్యామ్సన్ దగ్గరుండి మరీ సీహెచ్.బాలశౌరి, బాలశౌరమ్మ, అలాగే ముగ్గురు న్యాయవాదులను తీసుకుని కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వీరితోపాటు పేర్ని అనుచరులు కూడా పెద్దసంఖ్యలో వచ్చి కలెక్టర్ కార్యాలయం గేటు బయట వేచి ఉన్నారు. జనసేన తరపున పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరికి గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో వీళ్లు కూడా దానిని పోలిన గుర్తుకోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు.
'తమాషాగా ఉందా? మా ప్రచార రథం ఆపితే బాగుండదు'- మహిళా అధికారికి మంత్రి అప్పలరాజు బెదిరింపులు
గాజు గ్లాసును పోలీన గుర్తులు : ఓటర్లను అయోమయానికి గురిచేసి వల్లభనేని బాలశౌరికి పడే ఓట్లను వీరికి పడేలా చేయాలనే కుట్రలో భాగంగానే వైసీపీ ఆధ్వర్యంలో ఈ కుతంత్రానికి తెరలేపారు. సీహెచ్.బాలశౌరిని జాతీయ జనసేన అనే పార్టీ తరపున నామినేషన్ వేయించారు. అలాగే బాలశౌరమ్మను నవరంగ్ జాతీయ కాంగ్రెస్ అనే పార్టీ తరఫున బరిలోనికి దించారు. వీరిద్దరికీ జనసేన గ్లాసుకు దగ్గర పోలిక ఉండే బకెట్ గుర్తు కోసం తొలుత ప్రయత్నించినా అది వేరొక స్వతంత్ర అభ్యర్థికి వెళ్లిపోయింది. దీంతో పేర్ని అనుచరులు చాలామంది వచ్చి బాలశౌరమ్మకే బకెట్ గుర్తును ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట హడావుడి చేశారు. మరోవైపు సీహెచ్.బాలశౌరి పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్థికి పెన్ బాక్సు గుర్తును కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇదికూడా దాదాపుగా గ్లాసును పోలి ఉంటుంది. అందుకే ఎలాగైనా వల్లభనేని బాలశౌరికి పడే ఓట్లను మళ్లించాలని చాలా తీవ్రంగానే పేర్ని వర్గం ప్రయత్నాలు చేస్తోందని అర్థమవుతోంది.
కలెక్టరేట్ వద్ద తిష్టవేసిన న్యాయవాదులు : బాలశౌరమ్మ, సీహెచ్.బాలశౌరి పేర్లతో వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురికాకుండా పరిశీలనలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా వాటిని నివృత్తి చేసేందుకు ముగ్గురు న్యాయవాదులను సిద్ధంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉంచారు. వారితో పాటు పేర్ని నాని పీఏ శ్యామ్సన్, అభ్యర్థులు కూడా ఉన్నారు. పరిశీలన పూర్తయి నామినేషన్లకు ఆమోద ముద్ర పడేవరకూ వారంతా ఎదురుచూస్తూ కలెక్టరేట్ ప్రాంగణంలోనే వేచి ఉన్నారు.
టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు- 'టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారని ఇల్లు ఖాళీ చేయించారు'