Viveka Murder Case Approver Dastagiri Petition: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తనకు రక్షణ కల్పించాలంటూ దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ కేసులో అన్యాయంగా ఇరికించి జైల్లో పెట్టారని కడప జైల్లో ఉన్న సమయంలో తనను బెదిరించారని తెలిపారు. అంతేకాకుండా అనుకూలంగా వ్వవహరిస్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అవినాష్ రెడ్డి ప్రలోభ పెట్టారని దస్తగిరి తన పిటిషన్‌లో తెలిపారు. శివరాత్రి రోజు జరిగిన వేడుకల్లో పాల్గొనడానికి తన తండ్రి ఆలయానికి వెళ్తే అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అనుచరులు తన తండ్రిపై దాడి చేశారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్‌లో కోరారు. అప్రూవర్‌గా పరిగణించాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పైనా సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దాఖలు చేసిన నేరాభియోగపత్రంలోనూ తనను అప్రూవర్‌గా చేర్చారని కోర్టు సైతం తన విజ్ఞప్తిని అనుమతించాలని కోరారు. దీనిపై వాదనలు ముగియడంతో కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
అవినాష్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్లే దాడులు పెరిగాయి : దస్తగిరి
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న అవినాష్ రెడ్డి, వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను భయపెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించాలని సాక్షులను ప్రలోభ పెడుతున్నారని దస్తగిరి తరఫున సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎంపీ టికెట్టు విషయంలోనే వివేకాను సీఎం జగన్ చంపించారు: దస్తగిరి
నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు మిగతా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. వివేకా హత్యకు సంబంధించి మీడియాలో ట్రోల్ జరుగుతోందని దీనివల్ల కేసుపై ప్రభావం పడే అవకాశముందని వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. యూట్యూబ్‌లలో ఉన్న లింకులను తొలగించేలా ఆదేశాలివ్వాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. మీడియాకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని ఆ కథనాలు న్యాయస్థానంపై ఎలాంటి ప్రభావం చూపలేవని మీరు ఎందుకలా భావిస్తున్నారని కోర్టు తెలిపింది. కోర్టు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
జగన్ వైఎస్ వివేకాను చంపిందెవరో చెప్పు - ఆ తర్వాతే ఓట్లు అడుగు : చంద్రబాబు