Visakhapatnam Drugs Case: రాష్ట్రంలో పెను ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై పూర్తి వివరాలను సీబీఐ (Central Bureau Of Investigation) ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఓ నివేదిక రూపంలో పొందుపరిచింది. సంధ్య ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖ చేరిన ‘ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’ నుంచి 49 నమూనాల్ని పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. అంటే మొత్తం 25 వేల కిలోల ‘ఇన్‌యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’ లోనూ (Inactive Dry Yeast) డ్రగ్స్ ఉనికి ఉన్నట్లు స్పష్టమైంది. ఎంత పరిమాణంలో ఉన్నాయనేదే తేలాల్సి ఉంది. కనీసం 20 శాతం మేర డ్రగ్స్ కలగలిసి ఉంటాయనుకున్నా ఇంత భారీ మొత్తంలో చిక్కడం దేశంలోనే తొలిసారి కావొచ్చు.
ఇంతటి అతిపెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించేందుకు సీబీఐ 55 గంటల సుదీర్ఘ ఆపరేషన్ కొనసాగించింది. ‘బ్రెజిల్ నుంచి విశాఖకు SEKU-4375380 నంబరు కంటెయినర్ వస్తోందని, అందులో భారీగా డ్రగ్స్ ఉన్నాయని ఈ నెల 18న ఇంటర్‌పోల్ నుంచి దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి మెయిల్ అందింది. దాన్ని పట్టుకుని తనిఖీ చేయాలని అందులో సూచించింది. ఆ సమాచారం ఆధారంగా నిమిషాల వ్యవధిలో సీబీఐ ఫిర్యాదును రిజిస్టర్ చేసింది. సీబీఐ ఎస్పీ గౌరవ్‌మిట్టల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ‘ప్రత్యేక ఆపరేషన్ కోసం వస్తున్నాం, సహకారం కోసం కొందరు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలంటూ విశాఖలోని సీబీఐ విభాగానికి, కస్టమ్స్ శాఖకు దిల్లీ నుంచే ఆదేశాలు వెళ్లాయి.
ఆ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏంటి? - విశాఖ డ్రగ్స్ కేసులో సందిగ్ధంలో వైఎస్సార్సీపీ - Visakha drug case
అప్పటికప్పుడు దిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకునేందుకు విమానాలు లేకపోవటంతో సీబీఐ బృందం తొలుత బెంగళూరుకు వెళ్లి, అక్కడి నుంచి విశాఖకు మరో విమానంలో పయనమైంది. ఈనెల 18న సాయంత్రం దిల్లీ నుంచి బయల్దేరిన ఈ బృందం 19న ఉదయం 8 గంటల 15 నిమిషాలకు విశాఖ చేరుకుంది. నగరంలోని కస్టమ్స్ విభాగం ప్రిన్సిపల్ కమిషనర్‌ను కలిసి స్పెషల్ ఆపరేషన్ గురించి వివరించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్ గురించి అడిగింది. అది తమ ఆధీనంలోనే సురక్షితంగా ఉందని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ చెప్పడంతో CBI బృందం 19న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పోర్టుకు చేరుకుంది.
బైటపడిన లేత పసుపు రంగు పొడి: సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు తాము ఎందుకొచ్చామో వివరించి తనిఖీలు ప్రారంభించాయి. కంటెయినర్‌లోని ఒక్కో ప్లాస్టిక్ బ్యాగ్ తీస్తుంటే లేత పసుపు రంగు పొడి బైటపడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి తీసుకొచ్చిన ‘నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్’ కిట్‌ను ఉపయోగించి అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్ వంటి వాటిని నిర్ధారించేందుకు టెస్ట్-ఏ, కొకైన్, మెథక్వలోన్ ఉనికిని గుర్తించేందుకు టెస్ట్-ఈ, గంజాయి, హాషిస్, హాషిస్ ఆయిల్ వంటివి గుర్తించేందుకు టెస్ట్-బీ చేశారు. పరీక్షించిన నమూనాల్లో ‘టెస్ట్-ఈ, టెస్ట్-ఏ’కు సంబంధించి మాదకద్రవ్యాలు ఉన్నట్లు తేలింది.
బ్రెజిల్ నుంచి వచ్చిన ‘ఇన్ యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్’లో మాదకద్రవ్యాలున్నట్లు తేలటంతో సీబీఐ అధికారులు అక్కడే ఉన్న సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి గంగాధర్‌ను ప్రశ్నించారు. తాము మొదటిసారి దీన్ని దిగుమతి చేసుకున్నామని, అందులో ఏమేం కలిసి ఉన్నాయనే దానిపై అవగాహన లేదని సమాధానమిచ్చారు. అదే సమయంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున గుమికూడటంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. ఆ సమయంలో వర్షం పడే ఛాయలు కనిపించటంతో సరకు మొత్తం తడిచిపోతే పాడైపోతుందంటూ సంధ్య ఆక్వా ప్రతినిధులు సీబీఐ అధికారులకు విన్నవించారు.
ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక: సీబీఐ అధికారులు ఆ ప్యాకెట్లను రీప్యాక్ చేసి వాటిని కంటెయినర్‌లో భద్రపరచి సీల్ చేశారు. ఆ తర్వాత 20న ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి మళ్లీ పరీక్షలు ప్రారంభించగా, అన్ని నమూనాల్లోనూ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. సంధ్య ఆక్వా ప్రతినిధులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. బ్రెజిల్ నుంచి వచ్చిన సరకు మొత్తాన్నీ బయటకు తీసి వాటిని ఎన్‌వైకేయూ 0823944 నంబరు గల కంటెయినర్‌లోకి సీబీఐ మార్చింది. దానికి బ్రాస్ సీల్ వేసింది. ఆ తర్వాత సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొందరు వ్యక్తులపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని (Narcotic Drugs and Psychotropic Substances Act) సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసింది.
"విశాఖ కథా చిత్రమ్"లో అడుగడుగునా అనుమానాలే! - Visakha drug case