Victims Complaint on YSRCP Leaders Land Grabbing: గడిచిన ఐదేళ్లుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు సాగించిన భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మదనపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలో భారీ స్థాయిలో భూ ఆక్రమణలు జరిగినట్లు రెవెన్యూ అధికారులే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చిన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిసోదియా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
మదనపల్లె రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరుతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు ఆయన అనుచరులు పోలీసు, రెవెన్యూ అధికారుల భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారు అనేందుకు పోటెత్తిన బాధితులే నిదర్శనమన్నవాదన వినిపిస్తోంది.
అరాచకాలపై ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించడంతో బాధితులు ఏళ్లతరబడి ఎవరికీ చెప్పుకోలేక మదనపడ్డారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం దహనం కేసు దర్యాప్తులో భాగంగా భూబాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా వెల్లువలా తరలిచ్చారు. తమ బాధలను చెప్పుకున్నారు. పెద్దిరెడ్డి అనుచరులు సాగించిన అరాచకాలను వెలుగులోకి తెచ్చారు.
దస్త్రాలు భద్రంగా ఉన్నాయా? - రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి సమీక్ష - Madanapalle case updates
మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీస్థాయిలో భూ ఆక్రమణలు జరిగాయని రెవెన్యూ సిబ్బందిని ఓ అంచనాకు వచ్చినా, వారు ఊహించనిస్థాయిలో బాధితులు రావడంతో ఆశ్చర్యపోయారు. 11 మండలాల నుంచి వందలమంది బాధితులు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. నేరుగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలు అన్నీ పరిశీలించిన సిసోదియా, మదనపల్లె సబ్ కలెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల నుంచి వివరాలు స్వీకరించిన సిసోదియా, వాటిని పరిశీలించి వారం వారం నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఏం చేయాలనే దానిపై సమగ్ర విచారణ జరిపించి ఓ నిర్ణయానికి వస్తామని సిసోదియా వెల్లడించారు.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని ప్రకటన మేరకు 11 మండలాల నుంచి బాధితులు సబ్‌కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. వారందరూ కూడా వైఎస్సార్సీపీ నాయకుల అక్రమాలను, దందాలను మీడియాకు అటు సిసోదియాకు తెలియజేశారు. ఐదేళ్లలో నరకయాతన అనుభవించామని, ఇప్పుడైనా ప్రభుత్వం మారడంతో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని ఉద్దేశంతోనే తాము ధైర్యంగా ముందుకు వచ్చామని మహిళలు, వృద్ధులు, బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు దహనం కేసుకు సంబంధించి మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై ఆర్పీ సిసోదియా మూడు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టార్లతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అధికారుల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీఎస్పీ కార్యాలయంలో మకాం వేసి జరిగిన ఘటనకు సంబంధించి కేసు పురోగతిపై సంబంధిత పోలీసు అధికారులతో ఆరా తీశారు.
ఇప్పటివరకు ఎవరెవరిని ప్రశ్నించారు అనే దానిపైన ఆరా తీశారు. పాత్రధారుల విషయం బయటకు వచ్చిందా అనేదానిపై, ఇప్పటివరకు 35 మంది అనుమానితులను ప్రశ్నించామని, వారి కాల్ డేటా పరిశీలిస్తున్నామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు. నలుగురు రెవెన్యూ అధికారులు ఇంకా పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.