Transport Minister Said Working on Free Travel for Women in RTC Buses : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే అమలు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్నందున మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావులేకుండా రాష్ట్రంలో ప్రవేశ పెడతామన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి తెలుగుదేశం శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. విజయదుర్గ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గడచిన ఐదేళ్లలో జగన్ ముఠా దోపిడీ చేసిన ప్రజాధనాన్ని కక్కిస్తామని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లనున్న చంద్రబాబు - సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు కడపలోని విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.
ఉచిత ప్రయాణంపై త్వరలోనే అధికారిక ప్రకటన? : అలాగే గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు తిన్న సొమ్మంతా కక్కించేంత వరకు వదిలిపెట్టేది లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసిన మంత్రి ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
పొరపాట్లకు తావులేకుండా స్కీమ్ అమలుపై కసరత్తు : అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో రోజూ ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు? వీరికి ఫ్రీ జర్నీ స్కీమ్ అమలు చేస్తే ప్రభుత్వం ఎంత భారం పడుతుంది? అనే విషయాలపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నాట్లు తెలుస్తోంది. అలాగే, తెలంగాణలో ఈ స్కీమ్ అమలు చేసిన మొదట్లో ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ స్కీమ్ ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతిందని ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా ఈ స్కీమ్ అమలు చేసేలా ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.