Actor Hema Clarity on Bengaluru Rave Party : సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను టాలీవుడ్ నటి హేమ ఖండించారు. ముఖ్యంగా కన్నడ మీడియాలో నటి హేమ పేరు మార్మోగిపోతుంది. దీంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది.
తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆమె, ఇక్కడ ఓ ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. గత రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకెటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇందులోకి అనవసరంగా తనను లాగుతున్నారని, తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలువురు తెలుగు నటులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
"నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ నా ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. నాపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. అదంతా ఫేక్ న్యూస్. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నా మీద వస్తున్న వార్తలను నమ్మకండి."- హేమ, టాలీవుడ్ నటి
Hero Srikanth Clarify on Rave Party : అదేమాదిరిగా హీరో శ్రీకాంత్ స్పందిస్తూ, తాను రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తవమన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ఇందులోకి అనవసరంగా తమను లాగుతున్నారని, తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇరువురు కొట్టిపారేశారు. కాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలువురు తెలుగు నటులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
"చాలా సామాజిక మాధ్యమాల్లో నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు చూపిస్తున్నారు. అది నేను కాదు. నా మాదిరిగానే ఎవరో ఉంటే నేనని తప్పుగా చెప్పారు. ఈమధ్య నా భార్యతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇప్పుడేమో ఇలా. రేవ్ పార్టీకి వెళ్లే కల్చర్ నాది కాదు. దయచేసి ఎవరూ ఈ విషయాన్ని నమ్మొద్దు."-శ్రీకాంత్, టాలీవుడ్ నటుడు
అసలేం జరిగిందంటే : బెంగళూరు శివారులో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ బిజినెస్‌మెన్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రైడ్ చేశారు. దాదాపు 100 మందికి పైగా వ్యక్తులు ఆ పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ దొరికింది. అదేవిధంగా పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో జాగ్వార్, బెంజ్ సహా ఖరీదైన 15 కార్లను జప్తు చేశారు. ఐదుగురిని అరెస్టు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.