TDP Release Data On Rapes and Crimes Against Women : గత ప్రభుత్వంలో ఒక్క మహిళలపైనే 2,04,414 నేరాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. సుమారు 4,034 అత్యాచారాలు జరిగాయని, 22,278 మంది మహిళలు అదృశ్యమయ్యారని గణాంకాలు వెల్లడించింది. అనేక సందర్భాల్లో కేసులు నమోదు చేయలేదని పేర్కొంది. 5,660 సైబర్ నేరాలు జరగ్గా, గృహ హింసకు సంబంధించిన 15,065 కేసులు నమోదయ్యాయని వివరించింది. 60 వరకు సామూహిక అత్యాచారాలు, చిన్నారులపై 7,841 నేరాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా 6,604 ఘటనలు, 991 హత్యలు జరిగినట్లు వివరాలు విడుదల చేసింది. 2,005 మంది తెలుగుదేశం కార్యకర్తలు, 2,014 మంది జనసేన, 69 మంది బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపింది. 267 మంది అమరావతి రైతులపై 2,528 కేసులుపెట్టారన్న తెలుగుదేశం, 2,686 మందిని పొట్టనపెట్టుకున్నారని మండిపడింది.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఈ అకృత్యాలపై వైఎస్సార్సీపీ హయాంలోనే సాంఘిక సంక్షేమశాఖ 2023 జులైలో కేంద్రానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. ఒక్క 2022లోనే ఎస్సీ-ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 59 మంది దళిత, గిరిజనులు హత్యకు గురయ్యారు. మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి 2 వేల 893 కేసులు నమోదయ్యాయి.
చట్టం అమలులో తీవ్ర నిర్లక్ష్యం : ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏటా జనవరి, జులై నెలల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై హైపవర్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని చట్టం చెబుతోంది. జగన్ ఐదేళ్ల పాలనలో ఒకే ఒక్కసారి 2021లో నిర్వహించారు. ఎన్టీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై నిర్దేశిత కాల వ్యవధిలో సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలిచ్చింది.
బాధితులకు సత్వర సాయం లేదు : అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీట్ నమోదు చేయాల్సి ఉన్నా దాన్నీ జగన్ సర్కారు సరిగా పట్టించుకోలేదు. 2021లో 64 శాతం కేసుల్లో మాత్రమే 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2022 నాటికి అది 62 శాతానికి తగ్గింది. బాధితులకు సహాయ పునరావాసం 7 రోజుల్లో కల్పించాల్సి ఉన్నా 2022లో దాదాపుగా 91 శాతం కేసుల్లో బాధితులకు సత్వర సాయం అందలేదు.