TDP leader Ugra Narasimha Reddy key comments on CM Jagan: ఐదు సంవత్సరాల క్రితం కట్టిన టిడ్కో ఇళ్లను పంపిణీ చేయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని టీడీపీ కనిగిరి టీడీపీ ఇంచార్జ్ ఉగ్ర నరసింహ రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ ధన, రాజకీయ దాహంతో కళ్లు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక్క సెంటు ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కనిగిరిలో మీడియా సమావేశం నిర్వహించిన ఉగ్ర నరసింహ రెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ప్రకాశం జిల్లాకు ఏం చేశారు: గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను జగన్ ప్రభుత్వం ఇంతవరకూ పంపిణీ చేయలేదని ఉగ్ర నరసింహ రెడ్డి ఆరోపించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇప్పటికిప్పుడు హడావిడిగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. లబ్ధిదారులు ఇళ్ల పట్టాల కోసం గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగినా పట్టాలు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. పట్టాల పంపిణీ కార్యక్రమం కాస్త, ఓ ఫ్యాషన్ షోకు వచ్చి వెళ్లినట్లుగా ఉందని విమర్శించారు.
సీఎం జగన్ ప్రకాశం జిల్లాకు ఏం చేయలేదని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు, ఐఐఐటీ, నిమ్స్ వంటి ప్రాజెక్టులపై ఒక్కమాటైనా మాట్లాడలేదని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టును గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ నేత వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తైందని చెబుతున్నారని, ఎక్కడ పూర్తి అయ్యిందో చూపించాలని సవాల్ విసిరారు. సీఎం జగన్రెడ్డి ఎన్నికల కోసం ఆడుతున్న డ్రామా అంటూ ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు రెండు సెంట్లు కాదు మూడు సెంట్ల భూమి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
వైఎస్సార్సీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా - జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం
చెల్లి కూడా అరెస్ట్: జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్ షర్మిల, జగన్ కన్నా ఎక్కడ ఫేమస్ అవుతుందో అని అమెను అరెస్ట్ చేయించాడని విమర్శించారు. షర్మిలను అరెస్ట్ చేసి పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృష్యాలను రాష్ట్ర ప్రజలు చూశారని విమర్శించారు. సీఎం జగన్ రక్త చరిత్రపై పత్రికల్లో వాస్తవాలు రాస్తుంటే మీడియాపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని విమర్శించారు. జగన్ రాష్ట్రం వదిలి వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఉగ్ర నరసింహారెడ్డి ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు కృతజ్ఞతలు: కనిగిరి టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహ రెడ్డి పేరును ప్రకటిండంపై పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కనిగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని ఉగ్ర నరసింహ రెడ్డి పేర్కొన్నారు. మొదటి జాబితాలోనే ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడుకి ఉగ్ర నరసింహ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి: బాబు, పవన్