Southwest monsoon Rains Hit Districts Of Telangana : నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు జోగులాంబ గద్వాల్, నగర్ కర్నూల్, నల్గొండలో ప్రవేశించాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణకు తాకుతాయి. కానీ ఈ ఏడాది వారం రోజుల ముందే వచ్చాయి. జూన్ 6వ తేదీన రూతుపవనాలు తాకుతాయని అంచనా వేసినా, మూడు రోజుల ముందే ప్రవేశించాయి.
గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిస్తాయని వెల్లడించింది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపటి నుంచి వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. రెండు, మూడు మాసాలుగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు నైరుతి ఆగమనం, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి.
అన్నదాతల ఆనందం : కాగా ఈసారి ఎండలు మండిపోయాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. మరోవైపు సాగుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీరు లేమితో పంటలను తీవ్రంగా నష్టపోయారు. నైరుతి రుతుపవనాల రాకతో రైతులు, ప్రజలు కుదుటపడ్డారు. క్రితం సంవత్సరం కంటే ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ ( Meteorological Department ) వెల్లడించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అయినా వర్షాలు బాగా పడి పంటలు వృద్ధిగా పండాలని కోరుకుంటున్నారు.
ముందస్తు చర్యలపై సిద్ధమవుతున్న బల్దియా : ఎండలతో అలసిపోయిన ప్రజలు నైరుతి రుతుపవనాల రాకతో ఖుష్ అవుతున్నారు. హమ్మయ్యా, ఇప్పుడైనా వాతావరణం చల్లబడుతుందని ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు వర్షాకాలం మొదలు కావడంతో హైదరాబాద్ బల్దియా చర్యలకు సిద్దమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. డ్రైనేజీల్లో, కాలువల్లో చెత్తను తొలగిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు హైదరాబాద్ జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చిన్నపాటి వర్షాలకే మోకాళ్లోతు నీళ్లు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం రాక ముందు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడంతో లోతట్టు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు.
ప్రాణాలు అరచేతిలో - కొండచరియల్లో బిక్కు బిక్కుమంటున్న జనాలు - Houses damaged cause landslides