Police Questioned Perni Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో తప్పించుకునేందుకు దారులన్నీ ముసుకుపోతున్నవేళ గోదాము మేనేజర్ మానసతేజని బలిచేసేందుకు పేర్ని నాని కుటుంబం ప్రయత్నిస్తోంది. గోదాము మేనేజర్ తనకు తెలియకుండా బియ్యం తరలించారని పేర్ని నాని భార్య పోలీసులకు చెప్పారు. మరోవైపు పేర్నిని ఏ6గా చేర్చిన పోలీసులు అరెస్టుకు మాత్రం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. పోలీసుల మెతకవైఖరి వల్లే ఆయన దొంగపోలీస్ ఆటలు ఆడుతున్నారనే విమర్శలున్నాయి.
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని కుటుంబం గోదాము మేనేజర్ మానస్‌తేజపైకి నెపం నెట్టేసింది. బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన పేర్ని భార్య జయసుధను విచారణాధికారి ఏసుబాబు 45 ప్రశ్నలు వేశారు. ఈ కేసులో మిగతా నిందితులు వెల్లడించిన అంశాల గురించి ప్రశ్నిస్తే తనకు తెలియదు, గుర్తులేదు, కాదు, లేదు వంటి సమాధానాలే చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గోదాముల బాధ్యతను మేనేజర్ చూసుకున్నారని తనకు తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారనే నెపాన్ని నెట్టేసినట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసులో నిందితురాలైన జయసుధ బందరు మేయర్ వినియోగించే ప్రభుత్వ కారులో విచారణకు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జయసుధతోపాటు పోలీస్ స్టేషన్‌కి వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, లాయర్లు విచారణ గది బయట నుంచి తొంగి చూస్తూ ఆటంకం కల్పించే ప్రయత్నం చేశారు. జయసుధను ఎంతసేపు విచారిస్తారంటూ హంగామా చేయగా స్టేషన్ ఎస్సై సత్యనారాయణ వైఎస్సార్సీపీ నేతలకు సర్దిచెప్పారే తప్ప స్టేషన్‌కు దూరంగా పంపే ప్రయత్నం చేయలేదు.
Perni Nani Ration Rice Case : ఈ కేసులో పోలీసుల వైఖరి మొదటి నుంచి మెతకగానే కనిపిస్తోంది. పేర్ని నాని తన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాములో పౌరసరఫరాల శాఖ నిల్వ ఉంచిన బియ్యం మాయమైన విషయం వెలుగులోకి వచ్చి నెల దాటింది. కేసు నమోదు చేసి కూడా 20 రోజులు గడిచాయి. కొన్నాళ్లపాటు పేర్ని పేరే ఎఫ్ఐఆర్లో చేర్చని పోలీసులు కేసు తవ్వుతున్న కొద్దీ ఆయన ప్రమేయం మరింత బయటపడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేశారు.
గోదాము మేనేజర్ మానస్‌తేజను అదుపులోకి తీసుకున్నాక సేకరించిన ఆధారాల ఆధారంగా రెండు రోజుల క్రితం పేర్ని నానిని ఆరో నిందితుడిగా చేర్చారు. గత నెల 30న ఆయణ్ని ఏ6గా పోలీసులు చేర్చగా ఆ రోజు రాత్రి 7 గంటల వరకూ ఆయన మచిలీపట్నంలోని తన ఇంట్లోనే ఉన్నారు. కానీ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. తీరిగ్గా ఆరోజు రాత్రి 2 గంటల సమయంలో నానిని అరెస్ట్ చేయడానికి వారి నివాసానికి వెళ్లారు.
విషయం ముందే తెలుసుకున్న పేర్ని నాని పోలీసుల రాకకు కొన్ని గంటల ముందే మచిలీపట్నం నుంచి పరారయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లాక తీరిగ్గా అరెస్ట్ చేయటానికి ఇంటికి వెళ్లి ఉత్త చేతులతో పోలీసులు వెనక్కి వచ్చారు. నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఏ6గా చేర్చిన మరుక్షణమే పేర్నిని అదుపులోకి తీసుకునేవారు. కనీసం ఆయన కదలికలపై నిఘా పెట్టి పారిపోకుండానైనా చూసేవారు. కానీ ఈ రెండు విషయాల్లో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.
తెరవెనుక సహాయ సహకారాలు : పోలీసులతోపాటు టీడీపీ, జనసేనలోనూ పేర్ని నానికి కావాల్సిన వ్యక్తులు తెరవెనుక సహాయ సహకారాలు అందిస్తున్నారనే అరోపణలున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాకే చెందిన ఓ నాయకుడు, మరో జిల్లాకు చెందిన ఇంకో నేత ద్వారా ఆయన ఎప్పటికప్పుడు కేసు పరిణామాలు తెలుసుకుంటూ సందర్భానుసారంగా మాయమడం, ప్రత్యక్షమవడం చేస్తున్నారు. పేర్ని అరెస్ట్ కోసం గత నెల 31న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈలోగా నాని హైకోర్టులో పిటిషన్ వేయడం ఈ నెల 6వరకూ ఆయనపై తొందరపాటు చర్యలొద్దని పోలీసుల్ని ఆదేశించడం జరిగిపోయింది. దీంతో పేర్ని నానిని అరెస్ట్ చేయాల్సిన అవసరం తప్పిందనే భావనలో పోలీసులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బియ్యం దందా పేర్ని పన్నాగమే - రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసు - పోలీసుల అదుపులో కోటిరెడ్డి