Police Filed Cases on YSRCP Social Media Activities : సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై యూ ట్యూబ్ ఛానల్‌లో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చీనేపల్లి అలియాస్ పంచ్ ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతడిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన పదజాలంతో గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగేలా, రెచ్చగొట్టేలా 'ఎక్స్' వేదికపై కొంత మంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. బోయిన ఆద్య, రెడ్డిగారి అమ్మాయి, భార్గవ్, కల్యాణ్ చక్రవర్తి అలియాస్ కల్యాణ్ హనీ 111, సీనయ్య అలియాస్ శ్రీతారక్ 99 అనే ఖాతాల నుంచి ఈ వ్యాఖ్యలు చేసినట్లు చుట్టుగుంటకు చెందిన షేక్ నాగుర్‌వలీ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా, మార్ఫింగ్ ఫొటోలతో అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలపై ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌తో పాటు గవర్నర్‌పేట, సూర్యారావుపేట, అజిత్‌సింగ్‌నగర్, గుణదల, నున్న ఇలా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు వచ్చాయి. ఒక్క ఎన్టీఆర్ కమిషనరేట్‌లో వారం రోజుల్లోనే 62 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కసారి కేసుల్లో ఇరుక్కున్నారా వారి జీవితం పూర్తిగా పాడైపోయినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే దెబ్బైపోతారు - కొత్త చట్టాలు అమలు!
వైఎస్సార్సీపీ ప్రాయోజిత ముఠాలు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. కన్నూమిన్నూ కానక ఉచ్ఛనీచాలు మరచి, అవతలి వ్యక్తులను ఇష్టానుసారం తిడుతూ, మార్ఫింగ్ ఫొటోలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్ వంటివాటితో పాటు న్యూస్ వెబ్ సైట్లు, వివిధ యూట్యూబ్ ఛానళ్లల్లో సైతం అందులోని అంశాలతో సంబంధం లేకుండా వైఎస్సార్సీపీ ముఠాలు విషం చిమ్ముతూ అసభ్యకర పదజాలంతో కామెంట్లు పెడుతున్నాయి. చంద్రబాబు , పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా ప్రభుత్వంలోని ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా దూషణలతో దాడి చేస్తున్నాయి. ఈ వైఎస్సార్సీపీ ప్రాయోజిత ముఠాల్లో అత్యధికులు యువకులే. డబ్బుకు ప్రలోభపడో, తాయిలాలకు ఆశపడో చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందన్న విషయాన్ని గుర్తెరగడం లేదు.
సోషల్ మీడియాలో ఏం చేయకూడదు :
- ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు. ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయకూడదు.
- ప్రజల మధ్య విద్వేషాలు రగిలేలా పోస్టులు చేయకూడదు.
- అసత్యాలు ప్రచారం చేయడం, ఎదుటి వ్యక్తుల కుటుంబాలను ఉద్దేశించి అసభ్యంగా దూషిస్తూ పోస్టులు పెట్టకూడదు. వీటికి లైక్‌లు కొట్టడం, ఇతరులకు పంపడం చేయకూడదు.
- రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనడానికి వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా విభాగం చేస్తున్న అరాచకాల్లో భాగమైతే జీవితం అంధకారం అవుతుంది.
సామాజిక మాధ్యమాల్లో విషం కక్కుతున్న వైఎస్సార్సీపీ మూకలు - జల్లెడ పడుతున్న అధికారులు
తల్లిదండ్రులకూ ఇబ్బందే : ఉద్యోగాలు, చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారు పోలీసుల నుంచి తప్పనిసరిగా నిరభ్యంతర ధ్రువపత్రం (NOC) తీసుకోవాలి. దీనికి దరఖాస్తు చేసినప్పుడు హిస్టరీ ప్రొఫైల్ తీస్తారు. కేసులు ఉంటే మాత్రం ఎన్‌వోసీ ఇవ్వరు. ఇది లేకపోతే సదావకాశాలను కోల్పోయినట్టే. ఒక్కసారి కేసు నమోదు అయితే ఆ వ్యక్తిపై నిఘా ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులకూ ఇబ్బందే. కేసులు నమోదు అయినప్పుడు పిల్లలు దొరక్కపోతే తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చోబెడతారు.
వివరణ ఇవ్వాలి : సోషల్ మీడియాలో రాజకీయ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 62 కేసులు నమోదు అయ్యాయి. పోస్టులు పెట్టిన వారికి 41ఎ నోటీసులు ఇస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల వాసులకు నోటీసులు జారీ చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో ఆయా ప్రాంతాలకు చెందిన వారంతా జవాబులు ఇచ్చేందుకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలి వస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి : మీకు ఎవరైనా జుగుప్సాకరమైన చిత్రాలు, పోస్టులు, వీడియోలు పంపితే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అలాంటి సమాచార వ్యాప్తికి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లే బాధ్యులు. విషపూరిత సమాచార మార్పిడి విషయాల్లో భాగస్వాములు కాకుండా పిల్లల్ని తల్లిదండ్రులే అప్రమత్తం చేయాలి. పదే పదే తప్పుడు పోస్టులు పెడితే రౌడీషీట్, సస్పెక్టు షీట్, సైబర్ బుల్లీస్ షీట్ తెరుస్తారు. ఇవి ఒకసారి పెడితే ఉపసంహరించడం అంత సులువు కాదు.
వైఎస్సార్సీపీ సోషల్ సైకో నెట్‌వర్క్ - 50 వేల మందితో ఉన్మాదుల కర్మాగారం!