Buggana Rajendranath Irregularities : నంద్యాల జిల్లాలోని బేతంచెర్లలో పోలీసు శాఖకు చెందిన విలువైన స్థలాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోసం కట్టబెట్టారు. ఇప్పుడు ఈ విషయం విస్మయం కలిగిస్తోంది. బేతంచెర్ల నడిబొడ్డున ఉన్న ప్రధాన రోడ్డుకు ఆనుకొని పోలీసు శాఖకు రూ. కోట్ల విలువైన స్థలం ఉంది. ఒకప్పుడు అందులో పోలీసు ఉద్యోగుల వసతిగృహాలు ఉండేవి. అవి శిథిలావస్థకు చేరడంతో వాటిని నేలమట్టం చేశారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఆ స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకోవటానికి పుష్కల అవకాశాలు ఉన్నాయి. లేదంటే పోలీసు శాఖ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు.
Police Dept Road to Buggana House : కానీ గత వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలోని పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఆ స్థలం వెనక ఉన్న అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లడానికి వీలుగా కొంత భూమిని అనధికారికంగా ధారాదత్తం చేశారు. అంతకుముందు బుగ్గన ఇంటికి వెళ్లేందుకు ఇరుకు సందులో మూడు మలుపులు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. పోలీసు శాఖ స్థలంలో రహదారి నిర్మిస్తే ప్రధాన రోడ్డు నుంచి కుడి వైపునకు తిరిగితే నేరుగా వెళ్లిపోవచ్చు. ఇందుకోసం పోలీస్ శాఖ స్థలం మధ్యలో సుమారు 200 మీటర్ల పొడవైన సీసీ రోడ్డును నిర్మించారు. అప్పటి మంత్రి బుగ్గన మెప్పు పొందడానికి కోట్ల విలువైన స్థలాన్ని రహదారి కోసం అధికారులు ధారాదత్తం చేశారు.
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి : మరోవైపు తమ శాఖ పరిధిలోని మార్గం కానప్పటికీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ. 6.70 లక్షల నిధులు వెచ్చించారు. తరువాత ఆ స్థలంలో పోలీసు శాఖ వాణిజ్య సముదాయాన్ని నిర్మించింది. నాటి మంత్రి బుగ్గన ఇంటికి వెళ్లే దారిని వదిలిపెట్టి, వాణిజ్య సముదాయాన్ని కూడా రెండు భాగాలుగా నిర్మించారు. స్థలాన్ని వదలకుండా ఏక మొత్తంగా సముదాయం నిర్మిస్తే పోలీసు శాఖకు ఏటా రూ.1.50 లక్షల వరకు ఆదాయం అదనంగా వచ్చేదని అంటున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో అధికారులు ఈ రోడ్డుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ఇదెవరి ప్రాపకం కోసమో? : బేతంచెర్లలోని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటికి సమీపంలో నాగులకట్ట నుంచి పెద్దమండల్ వరకు సుమారు 2.2 కిలో మీటర్ల దూరం బీటీ రహదారి నిర్మించారు. ఇందుకు రూ. 2.30 కోట్లు వెచ్చించారు. ఈ రహదారిలో సుమారు 500 మీటర్ల వరకు మాత్రమే ఇళ్లు ఉన్నాయి. మిగిలిన 2 కిలో మీటర్ల దూరం పొలాలే. ఆ రెండు కిలో మీటర్ల దూరం బీటీ రోడ్డు అవసరం లేదని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అప్పటి మంత్రి ఒత్తిడితోనే ఆ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది.
చిన్నపాటి వర్షానికే బుగ్గన ఇలాకాలో నిర్మించిన భవనాలు నీటిపాలు! - Govt Buildings Submerged