People Suffer with Water Contamination in Vijayawada : విజయవాడ మొగల్రాజపురంలోని ప్రజలను కొన్ని రోజులుగా అతిసారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. బుధవారం నాడు ప్రభుత్వ ఆస్పత్రిలో దాదాపు వంద మంది చికిత్స కోసం వెళ్లారు. మరికొంత మంది ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం సహాయక చర్యలు చేపట్టడం లేదు. కనీసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం లేదు.
Water Pollution Deaths in Vijayawada : వీఎంసీ లో 7వ డివిజన్‌లోని అన్ని కాలనీలు, 8వ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అతిసారం వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. వైద్యారోగ్య శాఖ మాత్రం అనారోగ్యం పాలైన వారి పట్ల కాకిలెక్కలు వేస్తోంది. సాధారణంగా ఎక్కడైనా వ్యాధి ప్రబలిన వెంటనే సహాయ చర్యలు చేపడతారు. కానీ ఇక్కడ మాత్రం ఇంటింటి సర్వే అంటూ చికిత్సను గాలికొదిలేశారు. కనీసం మందులు కూడా సరఫరా చేయడం లేదు. పైగా అతిసారం లేదని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. మరణాలు కూడా సహజమైనవేనని కొట్టి పారేస్తున్నారు. బుధవారం నాడు కొత్తగా నలుగురు రోగులు వచ్చారని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికి 1231 నివాసాల్లో సర్వే చేశామని చెబుతున్నారు. అంతే తప్ప ఎంతమందికి వ్యాధి సోకింది? ఎంతమంది చికిత్స తీసుకుంటున్నారు? అనే వివరాలు మాత్రం సేకరించలేదు.
మొగల్రాజపురం ప్రాంతంలో కొన్ని రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీనిపై స్థానికులు ఫిర్యాదులు చేసినా అధికారులెవరూ పట్టించుకోలేదు. నీరు రంగు మారిపోయినా కనీసం గుర్తించలేదు. తొలుత అతిసారం బారినపడ్డవారు సొంత వైద్యం చేయించుకున్నారు. అప్పటికీ తగ్గకపోవటంతో ఆసుపత్రులకు వెళ్లారు. వల్లూరు దుర్గారావు చనిపోయాకే అతిసారం ప్రబలిన విషయం బయటకొచ్చింది. ఆయనకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయంటూ వీఎంసీ కమిషనర్ చెప్పడం వింతగా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అతిసారం బారినపడ్డవారంతా రోజువారీ కూలీలు, పేదలు, అసంఘటిత రంగ కార్మికులే. బాధితుల్లో చాలామంది వారం పది రోజులపాటు చికిత్స తీసుకున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు మాత్రం మొద్దునిద్రలో జోగుతున్నారు. అధికార పార్టీకి చెందిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇంతవరకు ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నా వారు అటువైపు కన్నెత్తయినా చూడలేదు. స్థానిక కార్పొరేటర్ ఆ ప్రాంతంలో పర్యటించనే లేదు. సెంట్రల్ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా ఉన్న వీఎంసీ కమిషనర్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు తప్ప బాధిత ప్రాంతాలపై దృష్టి పెట్టలేదు. తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇతర నేతలతో కలిసి బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. మరోవైపు సీపీఎం నేతలు వారి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి సిలైన్లు ఎక్కిస్తున్నారు. ఎక్కువ తీవ్రతతో బాధపడుతున్న రోగులను సీపీఎం కార్యకర్తలు ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఆదోనిలో కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత- ఒకరి పరిస్థితి విషమం - Drinking Contaminated Water
తాగునీరు కలుషితమవడం అతిసారానికి నలుగురు బలైపోయిన ఘటనకు కారణం నలుగురు వ్యక్తులంటూ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటర్ వర్క్స్ విభాగానికి చెందిన ఏఈ, పారిశుద్ధ్య విభాగానికి చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్, సచివాలయానికి చెందిన ఎమినిటీస్ సెక్రటరీ, ఫిట్టర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. వీరు ఇచ్చే సమాధానాన్నిబట్టి చర్యలు ఉంటాయని చెబుతున్నారు. నలుగురి ప్రాణాలు పోయినా కమిషనర్ తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింతగా విషమించకముందే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రామలింగేశ్వర్‌నగర్, కృష్ణలంక, రాణిగారితోట, క్రీస్తురాజపురం, సత్యనారాయణపురం, సీతారాంపురం, గుణదల, గంగిరెద్దులదిబ్బ, సింగ్‌నగర్ ప్రాంతాలకు కలుషిత నీటి ముప్పు పొంచి ఉందని పలువురు చెబుతున్నారు.