Pensioners died in Andhra Pradesh: వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రతాపానికి వృద్ధులు బలైపోతున్నారు. అసలు కొందరు పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. 2, 3 ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో జమైందో వివరాలు చెప్పలేదు. దీంతో వారంతా పింఛను వస్తుందా? రాదా? అని సచివాలయాల బాటపట్టారు. అక్కడ సరైన సమాచారం లేక ఆందోళనకు గురయ్యారు. సచివాలయం, బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. మండుటెండలకు తాళలేక ప్రాణాలు వీడుతున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ కుతంత్రాలకు వృద్ధుడు బలి: అధికారులే ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛను సొమ్మును ఈ నెల బ్యాంకులో వేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం పంచాయతీ పిచ్చిగుంటపల్లికు చెందిన ముద్రగడ్డ సుబ్బన్న (80) అనే వృద్ధుడు ఆటోలో 12 కిలో మీటర్లు ప్రయాణించి రాయచోటి పట్టణంలోని బ్యాంకు వద్దకు వెళ్లారు. మేడే సెలవు రోజు కావడంతో బ్యాంకు మూసేసి ఉంది. దీంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడగాడ్పులకు తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బన్న ఆటోలోనే కుప్పకూలిపోయారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నించగా అప్పటికే ఆయన ప్రాణాలు విడిచారు. పింఛను డబ్బులు ఇంటికి వచ్చి ఇస్తారో లేదోనని రెండు రోజులుగా ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్యాంకులో జమ చేస్తారని చెప్పడంతో బ్యాంకు వద్దకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇంటి వద్దకే వచ్చి పింఛను అందించి ఉంటే సుబ్బన్న ప్రాణాలు పోయేవి కాదని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.
పింఛను కోసం వెళ్లివచ్చి మృతి: నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 11వ వార్డుకు చెందిన వృద్ధుడు ఖలీల్‌బేగ్ (71) పెన్షన్ రాలేదన్న మనస్తాపంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖలీల్‌బేగ్ బుధవారం ఉదయం పట్టణంలోని సచివాలయం-5కు పింఛను కోసం వెళ్లారని తెలిపారు. ఈ నెల పింఛను మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేస్తారని సిబ్బంది చెప్పి పంపారన్నారు.
మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న ఆయన పెన్షన్ రాలేదని బాధపడుతూ మంచంపై పడుకుని మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఖలీల్‌బేగ్ వినికిడి సమస్యతో బాధపడేవారని, సచివాలయ సిబ్బంది చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేక, ఇక పెన్షన్ ఇవ్వరేమోనన్న మనస్తాపంతో మృతి చెంది ఉంటారని బంధువులు చెబుతున్నారు.
మండుటెండలో పండుటాకుల పాట్లు- పింఛన్ సొమ్ము అందక కన్నీళ్లతో ఇళ్లకు - Pensioners FACING PROBLEMS
పింఛను నగదులో బ్యాంకు కోత, లబోదిబోమంటున్న వృద్ధుడు: పింఛను సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటం కారణంగా వారికి దక్కాల్సిన మొత్తంలో బ్యాంకులు రకరకాల పేర్లతో కోత పెడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అనంతపురం జిల్లా కంబదూరుకు చెందిన మాచిపల్లి సుబ్బన్న అనే వృద్దుడికి పింఛను సొమ్ము 3 వేల రూపాయలు బుధవారం ఉదయం బ్యాంకు ఖాతాలో జమైంది. వెంటనే సేవా ఛార్జీలకు చెందిన బకాయిలు పోను, బ్యాంకు బ్యాలెన్స్ 786.12 రూపాయలు మాత్రమే ఉందంటూ ఆ వృద్దుడి మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వచ్చింది.
ఈయన స్వగ్రామం కంబదూరు కాగా, బతుకు తెరువు కోసం అనంతపురంలో ఉంటున్నారు. ఆరేళ్ల క్రితం కర్నూలు నగరంలో ఓ ప్రైవేటు వసతి గృహంలో ఆయన పని చేశారు. అప్పట్లో అక్కడ ఆంధ్రా బ్యాంకు (యూనియన్ బ్యాంకు)లో అకౌంట్ తెరిచారు. ఆరు సంవత్సరాలుగా ఆ ఖాతా కార్యకలాపాలు నిర్వహించలేదు. ప్రస్తుతం పెన్షన్ సొమ్ము ఆ ఖాతాలోనే జమైంది. తన జీవనానికి పెన్షన్ అవసరమని, ఇప్పుడు బ్యాంకు వాళ్లు ఛార్జీల రూపంలో కోతపెట్టి అన్యాయం చేశారని బాధితుడు వాపోయాడు.
అదే మొండి వైఖరి - ఇంటికెళ్లిన సచివాలయ సిబ్బంది పింఛన్ ఇవ్వలేరా ? - Pension Distribution issue