Old Age Pensioners Problems in Andhra Pradesh : జగన్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మంది వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. అసలు కొందరు పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. 2, 3 ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో జమైందో వివరాలు చెప్పలేదు. దీంతో వారంతా పింఛను వస్తుందా? రాదా? అని సచివాలయాల బాటపట్టారు. అక్కడ సరైన సమాచారం లేక ఆందోళనకు గురయ్యారు.
Pension Distribution in AP : కొన్ని చోట్ల బ్యాంకుల్లో వేశామన్న సమాచారం ఇవ్వకపోవడంతో పింఛను కోసం సచివాలయాలకు చాలా మంది వెళ్లారు. తీరా అప్పుడు బ్యాంకుల్లో వేసినట్లు చెప్పడంతో ఊసూరుమంటూ వెనుదిరిగారు. ఇలా పింఛనుదారులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉందో సీఎం జగన్ అన్ని కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. మండుటెండల్లో వృద్ధుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఎంతో సులువైనా కావాలనే పక్కన పెట్టారు. గత నెల సచివాలయాల దగ్గర పంపిణీ చేయగా రెండు రోజుల్లోనే పూర్తయింది. ఈ సారి బ్యాంకుల్లో జమ చేసి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టారు.
మండుటెండలో పండుటాకుల పాట్లు- పింఛన్ సొమ్ము అందక కన్నీళ్లతో ఇళ్లకు - Pensioners FACING PROBLEMS
వృద్ధుల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర : రాష్ట్రవ్యాప్తంగా 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో బ్యాంకు ఖాతాలున్న వారు 48.92 లక్షల మందని చూపారు. ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాల్సింది 16.57 లక్షల మందికని తేల్చారు. ఇవన్నీ కాకిలెక్కలేనని తేలిపోయింది. నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచాన పడ్డవారి చాలా మంది పేర్లు ఇంటింటికీ పంపిణీ చేసే పింఛనుదారుల జాబితాలో లేవు. బ్యాంకు ఖాతాలు లేని వారి పరిస్థితీ ఇంతే. వారి పేర్లు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే వారి జాబితాలో వచ్చాయి. ఏ బ్యాంకులో నగదు జమైందో తెలుసుకుందామంటే ఆ వివరాలు సచివాలయాలకు పంపలేదు. బ్యాంకుల్లో జమవుతాయని ఒక జాబితా తయారు చేసి సచివాలయాల వారీగా పేర్లు మాత్రమే పంపారు. బ్యాంకుల వారీగా వివరాలు ఒకటి, రెండు రోజుల్లో పంపుతామని సమాచారమిచ్చారు. బ్యాంకు ఖాతాలు లేని వారు, 2, 3 ఖాతాలున్న వారు, ఖాతాలు మురిగిపోయిన వారు, పింఛను పరిస్థితి ఏమిటోనని 1వ తేదీనే గ్రామ, వార్డు సచివాలయాలను ఆశ్రయిస్తారని జగన్‌కు తెలియదా? అయినా వివరాలన్నీ సచివాలయాలకు పంపకుండా జాప్యం చేశారంటే అది వృద్ధుల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్రే కాక మరేంటనే వాదన వినిపిస్తోంది.
Pension Door To Door Delivery : నిజంగా పింఛనుదారుల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనే ఉంటే ఎంత మంది ఖాతాలు మనుగడలో ఉన్నాయి? ఏ బ్యాంకు ఖాతాకు వారి ఆధార్‌కార్డు అనుసంధానమైంది? ఏ ఖాతాలో జమ చేస్తున్నాం? మురిగిపోయిన ఖాతాలెన్ని? వంటి వివరాలన్నీ పింఛను పంపిణీ కన్నా ముందుగానే తెలుసుకుని లబ్ధిదారులకు తెలియజేసే వారు. ఏప్రిల్, మే నెల పింఛను పంపిణీ మధ్య నెల రోజుల గడువు ఉంది. అయినా ఈ కసరత్తేమీ చేయకుండా పింఛనుదారుల్ని ఇబ్బందులకు గురిచేసే కుట్రను అమలు చేశారు. మంగళవారం నాటికే పింఛనుదారుల సొమ్మును బ్యాంకుల్లో జమ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఎంతమంది ఖాతాల్లో జమైందనేదానిపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం లేదు.
అదే మొండి వైఖరి - ఇంటికెళ్లిన సచివాలయ సిబ్బంది పింఛన్ ఇవ్వలేరా ? - Pension Distribution issue
బుధవారం సాయంత్రానికి 9 లక్షల మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమైనట్టు తెలుస్తోంది. అదే సమయానికి మురిగిపోయిన ఖాతాల కారణంగా 75 వేల మంది పింఛనుదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. మొత్తం ఎంతమంది ఖాతాల్లో నగదు జమైంది? అది ఏ ఖాతాలో జమైంది? ఎన్ని ఖాతాలు మురిగిపోయాయి? అనే వివరాలు ఈ సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అప్పటివరకు పింఛనుదారుల్ని సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేయాలనే ఆలోచనే ఇది. ఎంతమంది బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదో లెక్క తేలిన తర్వాత వారి ఇళ్ల వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేస్తారు.
ఏ ఖాతాల్లో జమైందో తెలీదు : వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు తనకు మూడు బ్యాంకు ఖాతాలున్నాయని, ఏ ఖాతాలో జమైందో తెలపాలంటూ సచివాలయాన్ని ఆశ్రయించారు. వారి వద్ద ఆ సమాచారం లేదు. బాపట్ల జిల్లా పిడుగురాళ్ల మండలంలోని ఓ సచివాలయానికి నలుగురు వృద్ధులు వెళ్లి అదే విషయాన్ని అడిగారు. విజయనగరం మండలం రాకూడు సచివాలయం పరిధిలోనూ ఇదే పరిస్థితి.
నంద్యాల జిల్లా కోటకందుకూరులో పింఛను గ్రామ సచివాలయానికి వెళ్లిన లబ్ధిదారులు నగదు బ్యాంకు ఖాతాల్లో జమైదంటూ చెప్పడంతో వారు వెనుదిరిగారు. దివ్యాంగులు, మంచాన ఉన్న పింఛనుదారుల ఇళ్ల వద్దనే నగదు అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయగూడెం వెళ్లిన సచివాలయం సిబ్బందిని, ఇతర కేటగిరీల పింఛనుదారులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీంతో వారు బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేసిందంటూ సమాచారమిచ్చారు. ఏ బ్యాంకు ఖాతాల్లో జమైందో చెప్పాలని అడగ్గా ఆ వివరాలు మాత్రం తెలియదన్నారు.
టీడీపీపై విష ప్రచారం : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల సచివాలయం పరిధిలో ఇంటింటికీ పింఛన్లు అందించకపోవడానికి టీడీపీనే కారణమని అక్కడి సిబ్బంది విష ప్రచారం చేశారు. గత నెల సచివాలయాల వద్దే పంపిణీ చేశారు కదా? ఇప్పుడు ఎందుకు బ్యాంకుల్లో జమ చేశారంటూ కొంతమంది వృద్ధులు సిబ్బందిని ప్రశ్నిస్తే వారు దీనికి కారణం టీడీపీనే అంటూ తప్పుడు సమాచారమిచ్చారు. దీనిపై పింఛనుదారులు వారిపై మండిపడ్డారు. దీంతో ఆ ఉద్యోగులు అక్కడి నుంచి జారుకున్నారు. ఇంటింటికీ పంపిణీ చేయమని చెప్పిన పింఛనుదారులకూ ఇళ్ల వద్ద నగదు అందించడం లేదు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని కొర్ని సచివాలయం సిబ్బంది గ్రామంలోని రచ్చబండ వద్దకు పిలిపించి పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. అక్కడి టీడీపీ నాయకులు అడ్డుచెప్పడంతో ఆ తర్వాత పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.