NRI Sivakrishna Charitable Trust: మనం బాగుంటే సరిపోదు మన చుట్టుపక్క వాళ్లు కూడా బావుండాలి అనేది ఈ యువకుడి సిద్ధాంతం. చిన్నతనం నుంచి అదే సిద్ధాంతాన్ని నమ్మి తనవంతుగా సమాజసేవ చేసుకుంటూ వస్తున్నాడు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటూ వాళ్ల కష్టాల్లో భాగమవుతున్నాడు. శివక్రిష్ణ చారిట్రబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక మంది వృద్ధులకు, పిల్లలకు సేవలు అందిస్తున్నాడు.
ఈ యువకుడు పేరు శివక్రిష్ణ. అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ స్వస్థలం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ యువకుడి చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. అయినా చదువుల్లో రాణించి ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండేవాడు. ఆర్థిక కష్టాలు అధిగమించి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సాధించాడు.
అమెరికాలో ఉద్యోగం చేస్తూ కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకున్నాడు శివక్రిష్ణ. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టి, పెరిగిన నేలను మరవద్దనే అమ్మ చెప్పిన మాటలను బలంగా నమ్మాడు. అమెరికాలో ఉద్యోగం చేసినా మనసంతా సొంతూరిపైనే ఉండేది. బాల్యం నుంచి తన ఎదుగుదలకు సహకరించిన గ్రామానికి ఎదైనా చేయాలని భావించాడు. ఆలోచనని ఆచరణలోకి తెస్తూ 2010లో శివకృష్ణ చారిట్రబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు.
తనలా సమాజానికి సేవచేయాలనుకునే ఆసక్తిగల యువత సాయంతో చారిట్రబుల్ ట్రస్ట్ నడిపించాడు శివక్రిష్ణ. తను చదువుకున్న పాఠశాలలో నీటిశుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేయించాడు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే గర్భిణిలకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ పేదలకు తనవంతుగా సహాయం అందిస్తున్నాడు. ఇల్లు కదల్లేని వృద్ధులకు అన్ని సహకారాలు అందిస్తూ మానవతా గుణాన్ని చాటుకుంటున్నాడు ఈ యువకుడు.
భావితరాలకు అందించగలగే ఆస్తి విద్య ఒక్కటే అని నమ్మాడు శివక్రిష్ణ. పేద కుటుంబాల పిల్లలకు నవోదయ, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు. శిక్షణ పొందిన విద్యార్థులలో ఏటా 25 నుంచి 30 మంది పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి సీట్లు పొందుతున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులను తన సొంత ఖర్చుతో ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నాడని చెప్తున్నారు శివక్రిష్ణ స్నేహితులు.
నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు శివక్రిష్ణ. అతని కష్టానికి ప్రతిఫలంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో పిల్లలకు సీట్లు రావడంపై విద్యార్థుల తలిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివక్రిష్ణ సహాయంతోనే తమ పిల్లలు మంచి చదువులు చదువుతున్నారని చెప్తున్నారు.
విదేశాల్లో ఉండి ఎంత సంపాదించినా రాని సంతృప్తి పుట్టిన గడ్డకు సేవ చేస్తుంటే వస్తుందని అంటున్నాడు శివక్రిష్ణ. చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి ఎంతో మందికి సేవ చేయానని, ఇక ముందు కూడా మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తానని అంటున్నాడు ఈ యువకుడు.