Sale Non Teaching Staff Posts : వైఎస్సార్సీపీ హయాంలో కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో 191 బోధనేతర సిబ్బంది పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ బంధువులు అక్రమ నియామకాల్లో చక్రం తిప్పారు. ఒక్కో ఔట్ సోర్సింగ్ పోస్టును రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన వర్సిటీ యాజమాన్యం ఒక్కో సిబ్బందికి రూ.7,000ల నుంచి రూ.70,000ల వరకు వేతనాలు ఇచ్చింది.
వైఎస్సార్సీపీ నేతల సిఫారసుతో పోస్టుల భర్తీ : ఔట్ సోర్సింగ్ పోస్టులు 73, కాంట్రాక్టు నియామకాలు 57, డైలీ వేజెస్ కింద 53, పీస్ మీల్ పేరుతో 5 నియామకాలు, హెల్త్ సెంటర్ కింద కాంట్రాక్టు పద్ధతిలో 3 పోస్టులు భర్తీ చేశారు. మొత్తం 191 పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి , అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజంపేట ఎంపీ, కమలాపురం ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో ఈ పోస్టులను భర్తీ చేసినట్లు తెలుస్తోంది.
వెలుగులోకి అక్రమ నియామకాలు : యోగి వేమన వర్సిటీలో పీజీ చదివిన గంగా సురేష్ సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా అక్రమ నియామకాల బాగోతం వెలుగు చూసింది. అక్కడ ప్రొఫెసర్‌గా పనిచేసే జగన్ సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి ఈ నియమాకాల్లో చక్రం తిప్పారు. మొత్తం ముగ్గురు వీసీలు, ముగ్గురు రిజిస్ట్రార్ల కాలంలో ఈ అక్రమాలు జరిగాయి. 2019 జూన్‌లో శక్తీ ఏజెన్సీ పేరిట టెండర్ పిలిచి 76 బోధనేతర సిబ్బంది నియామకానికి నిర్ణయం తీసుకున్నారు.
కానీ ప్రభుత్వం పాత ఏజెన్సీలను రద్దు చేసి ఆప్కాస్‌ను ప్రవేశపెట్టింది. ఆప్కాస్‌ను కాదని వర్సిటీలో పాతపద్ధతిలోనే నవంబర్‌లో నియామకాలు పూర్తి చేశారు. అప్పట్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న వీసీ ఎంఆర్కే రెడ్డి, రిజిస్ట్రార్ గులాం తారీఖ్ ఈ పని చేసినట్లు తేలింది. మరోవైపు 2022 నవంబర్ 24న ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫారసు లేఖతో ఏడుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించినట్లు ఉపకులపతి అధికారిక ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. రూ.12,000ల జీతంతో వీరికి ఉద్యోగం ఇచ్చినట్లు సహ చట్టం దరఖాస్తుకు సమాధానంగా అధికారులు అందజేశారు.
ఈ క్రమలోనే 2022 డిసెంబర్ 12న అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల సిఫారసు లేఖతో రూ.15,000ల వేతనంతో చల్లా పావని అనే మహిళను జూనియర్ అసిస్టెంట్ పోస్టులో నియమించారు. ఈ సిఫారసు లేఖను వీసీ ప్రొసీడింగ్స్‌లో పొందుపరిచారు. 2022 మే 2న అవినాష్‌రెడ్డి సిఫారస్సుతో మరో ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చారు. రాజంపేటకు చెందిన వైెఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి సిఫారసుతో నరేశ్‌కుమార్ రెడ్డి అనే డాక్టర్‌ను కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.53,495 వేతనంతో నియమించారు. వర్సిటీలో కో-ఆర్డినేటర్ పోస్టులో సంపత్‌కుమార్ అనే వ్యక్తిని నియమించి రూ.70,000ల వేతనం కేటాయించారు. ఇది ఓ ప్రముఖ వ్యక్తి సిఫార్సు ద్వారా భర్తీ చేశారు.
Jobs Sold in Vemana University : అదేవిధంగా వర్సిటీలో 44 మంది పారిశుద్ధ్య కార్మికులు, 13 మంది సెక్యూరిటీ సిబ్బందిని కలిపి ఏడాదికి రూ.1,11,23,600లను విశ్వవిద్యాలయ అంతర్గత నిధుల నుంచి చెల్లించేలా ప్రొసీడింగ్స్‌లో చూపారు. 2023 జనవరి 27న రిజిస్ట్రార్‌గా పనిచేసిన వెంకట సుబ్బయ్య వీసీ ప్రొసీడింగ్స్ లేకుండానే తానే స్వయంగా డైలీ వేజ్ కింద 2 పోస్టులను భర్తీ చేశారు. ఈ నియామకాలన్నీ ఇష్టానుసారంగా భర్తీ చేశారు. వీటిపై విచారణ జరిపించాలని సహ దరఖాస్తుదారుడు సురేష్ మంత్రి లోకేశ్‌కు ఆధారాలతో సహా లేఖ రాశారు.
మరోవైపు కడపలోని ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో బోధనేతర సిబ్బంది నియామకాల్లోనూ భారీగా అక్రమాలు జరిగాయి. ఇక్కడ 78 మందిని తీసుకున్నారు. 2024 మార్చి 11న 46 మందిని డైలీ వేజ్ కింద నియమించారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందు లక్షల రూపాయలు తీసుకుని నియామకాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను రెగ్యులర్ ఉద్యోగాలతో భర్తీ చేయాల్సి ఉండగా వాటినీ ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేశారు. ఈ వర్సిటీకి కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు జగన్ బంధువు ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి రిజిస్ట్రార్‌గా పనిచేశారు.