NID Students Problems with Lack of Facilities: విభజన అనంతరం రాష్ట్రంలో ఏర్పాటైన ప్రతిష్టాత్మక సంస్థల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఒకటి. 2015లో ఈ సంస్థ మన రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించింది. టీడీపీ హయాంలో ఎన్‌ఐడీ కోసం రాజధాని అమరావతిలో 50 ఎకరాల భూమి కేటాయించింది.
అక్కడ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. వర్శిటీ సమీపంలోని ఐజేఎం అపార్టుమెంట్లలో విద్యార్థులకు తాత్కాలిక వసతి కల్పించారు. అమరావతిలో క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిలో నిర్మాణాలు ఆపేసింది.
ఆ ప్రభావం ఎన్‌ఐడీ పైనా పడింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావటంతో నిధులు విడుదల చేసింది. అయితే ఎన్‌ఐడీకి వెళ్లటానికి సరైన రహదారులు కూడా లేవు. దీంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు పనులు ఆలస్యం చేశారు. నేటికీ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక క్యాంపస్ ఒప్పందం 2023 డిసెంబర్‌తో ముగిసింది. దీంతో ఈ ఏడాది మార్చి 18న అమరావతిలోని ఎన్‌ఐడీ క్యాంపస్‌కు విద్యార్థులను తరలించి అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. హాస్టల్ నిర్మాణ పనులు పూర్తికాకపోవటంతో మౌలిక వసతుల సమస్య ఏర్పడింది.
విద్యాసంస్థలో తాగునీటి సదుపాయం లేకపోవటంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవటంలేదని విద్యార్థులు వాపోతున్నారు. కొద్దిరోజుల క్రితం తాగునీరు కలుషితమై 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో పరిస్థితి విషమించినవారిని 19 కిలోమీటర్ల దూరంలోని ఎయిమ్స్‌కు తరలించటానికి సుమారు గంట సమయం పట్టింది.
వైఎస్సార్ చేయూత సంబరాల్లో డీజే సౌండ్లు - పరీక్ష రాస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు
ఇండస్ట్రియల్, కమ్యూనికేషన్, స్ట్రక్చర్ డిజైనింగ్ వంటి కోర్సులు కేంద్ర ప్రభుత్వ సంస్థలో చదివేందుకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వసతి సౌకర్యాలు పూర్తి చేయకుండానే హడావుడిగా విద్యార్థులను తీసుకువచ్చి తరగతులు ప్రారంభించారు.
వసతి గృహాల్లో విద్యార్థులకు పెట్టే ఆహారం, డైనింగ్ హాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా చర్యలు లేకపోవటంతో బాలికల హాస్టల్లోకి అర్ధరాత్రి అక్కడ పనులు పర్యవేక్షించే సైట్ ఇంజనీర్ చొరబడటంతో విద్యార్థులు అతనితో గొడవకు దిగారు.
విద్యా సంస్థ చుట్టూ ముళ్ల పొదలున్నాయని తాము పడుతున్న అవస్థలను విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందన కరవటంతో ఎన్‌ఐడీ క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. గవర్నింగ్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడి పరిస్థితిని ఫొటోలు తీసి పంపించారు.
విద్యార్థుల సమస్యలపై స్పందించి దిల్లీ ఉన్నతాధికారులు ఎన్‌ఐడీ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఎన్‌ఐడీ అధికారులను వారికి ఇక్కడి పరిస్థితిని నివేదించారు. గవర్నింగ్ కౌన్సిల్ గత గురువారం అమరావతిలోని ఎన్‌ఐడీ విద్యా సంస్థను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.