Avanthi Srinivas Quit YSRCP : ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక కొందరు రాజీనామా బాట పట్టారు. మరికొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. పలువురు మేయర్లు, కౌన్సిలర్లు గుడ్ బై చెప్పేశారు. తాజాగా వైఎస్సార్సీపీకి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్), భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేశారు.
విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు అవంతి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని చెప్పారు. ఐదు సంవత్సరాలు పాలించాలని కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. కనీసం ఐదు నెలల కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
Grandhi Srinivas Resigned YSRCP : వైఎస్సార్సీపీలో కార్యకర్తలు నలిగిపోయారని ముత్తంశెట్టి శ్రీనివాసరావు వివరించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పారు. ఐదేళ్లు శ్రేణులందరూ ఇబ్బంది పడ్డారని వాపోయారు. ఇప్పుడు మళ్లీ వాళ్లను రోడ్డెక్కమనడం సరికాదన్నారు. తాడేపల్లిలో కూర్చుని ఆయన (జగన్‌ను ఉద్దేశించి) ఆదేశాలిస్తారని కానీ క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బంది ఎదుర్కొన్నట్లు వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు. మరోవైపు వైఎస్సార్సీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను అధ్యక్షుడు జగన్‌కు పంపారు.
'జగన్‌కు బాధ్యత లేదు - గుడ్ బుక్ కాదు గుండె బుక్ ఉండాలి' - వైఎస్సార్సీపీకి రాజీనామా