Water Released from Prakasam Barrage Today : వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే తమ లక్ష్యమని జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగారని ఆరోపించారు. పట్టిసీమ వట్టిసీమన్న జగన్, అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కాల్వలకు నీటి విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Minister Nimmala On irrigation : అంతకుముందు నిమ్మల రామానాయుడు మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రతో కలిసి ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని నిమ్మల రామానాయుడు తెలిపారు. బ్యారేజీ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాలకు నీటి విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పులిచింతల ఎండిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 40 టీఎంసీలు ఉండాల్సినచోట అర టీఎంసీ కూడా నీటి నిల్వలేదని విమర్శించారు. చివరి ఎకరాకు నీళ్లిచ్చేవరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఐదేళ్లలో రైతులకు అన్యాయం జరిగింది : చింతలపూడి ప్రాజెక్టును వైఎస్సార్సీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఐదేళ్లు పూడిక తీయక రైతులకు అన్యాయం జరిగిందని చెప్పారు. కాల్వల నిర్వహణ పనులు ఫిబ్రవరి, మార్చిలో చేసేట్లు జాగ్రత్త వహించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, బొండా ఉమ, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తదితురులు పాల్గొన్నారు.
అనంతరం గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు ఆయన పూజలు చేశారు. ఈ క్రమంలోనే డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని ఆయన విడుదల చేశారు.