Lunch at Chimakurthy Government Junior College : ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకప్పుడు ఘన చరిత్ర కలిగిందే. కాల క్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పెరిగిపోవడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. చుట్టు ప్రక్కల గ్రామీణ విద్యార్థులకు ఇదొక్కటే కళాశాల. పేద విద్యార్థులు ఈ కళాశాలకు రాలేక, చదువులు మానుకున్నారు. దీంతో కొన్ని గ్రూప్‌లను కూడా రద్దు చేశారు. పైగా కళాశాల భవనాలు కూడా శిథిలమయ్యాయి.
మధ్యాహ్నం భోజన సౌకర్యం ఏర్పాటు : కళాశాల దీన స్థితిపై అప్పట్లో ఈనాడు, ఈటీవీలో కథనాలు వచ్చాయి. వాటిని చూసిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాలకు మళ్లీ పూర్వ వైభవం తేవాలని సంకల్పించారు. కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. 2012 సంవత్సరంలో విరాళాలు సేకరించి, తరగతి గదులను మరమ్మతులు చేయడం, బెంచీలు సమకూర్చడం చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు భోజనం ఇబ్బంది అవుతుందనే విషయాన్ని గమనించి, దాతల సహకారంతో మధ్యాహ్నం భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
దాతలు సహకారం : దీంతో మూసివేస్తారనుకున్న కళాశాలలో విద్యార్థులు జాయిన్ అవడం ప్రారంభించారు. పాత గ్రూప్‌లు పునరుద్దరించడంతో విద్యార్థుల సంఖ్య 220కి పెరిగింది. భోజన కార్యక్రమం ఇలా కోవిడ్ వరకూ నడిచింది. తరువాత భోజన కార్యక్రమం మధ్యలో నిలిచిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన కళాశాల సిబ్బంది, పూర్వ విద్యార్థుల కమిటీ మళ్లీ రంగంలోకి దిగి, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్దరించారు. సాధారణంగా పాఠశాల స్థాయి వరకే ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్యక్రమం చేపడుతుంది. కళాశాల స్థాయికి ఈ సౌకర్యం లేదు. ఇక్కడ మాత్రం దాతలు సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. దీనిపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి ప్రధాన గ్రూప్‌లన్నీ ఇక్కడ ఉన్నాయి. దాదాపు 100 మంది విద్యార్థుల వరకూ ఇక్కడ ఉన్నారు. ప్రతీ రోజు మధ్యాహ్నం ఉచిత భోజనం నిర్వహించడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని నిర్వహకులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు వల్ల విద్యార్థులు కళాశాలలకు వచ్చి చదువుకోడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలో అడ్మిషన్లు కూడా పెరుగుతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శభాష్ అనిపిస్తున్న కెనడా కుర్రాడు - పేద విద్యార్థులకు సాయం - NRI Rohan Cherla Helping