Kodi Kathi Case Hearing Adjourned: జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి కేసులో 5 ఏళ్లు కారాగారంలో ఉండి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు ఈ రోజు కోర్టుకు హాజరయ్యాడు. ఎన్ఐఏ కోర్టుకి ఇంఛార్జిగా ఉన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి విచారణ జరిపారు. నిందితుడు శ్రీనివాసరావు దూరం నుంచి రావాలని గుర్తించి ఏప్రిల్ 19వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేశారు.
నిందితుని తరఫు న్యాయవాదులు అబ్దుల్ సలీం, పిచ్చుకల శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం కోర్టు బయట న్యాయవాది సలీం, విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కూడా కోడి కత్తి కేసును అడ్డం పెట్టుకొని లబ్ది పొందాలని చూసిన జగన్ మోహన్ రెడ్డి పన్నాగం బెడిసి కొట్టిందని న్యాయవాది సలీం అన్నారు.
విచారణ నిలిపి వేయాలని జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఉన్న స్టేను ఎత్తివేసేలా చేసి ఎన్నికల్లోపు కేసులో నిజానిజాలు ప్రజల ముందు ఉంచుతామని శ్రీను తరఫు న్యాయవాది సలీం అన్నారు. నిర్దోషిగా శ్రీనివాస్‌ను బయటకు తెస్తానని సలీం తెలిపారు. కోడికత్తి కేసులో జగన్ వాంగ్మూలం ఇవ్వాలని సలీం కోరారు. జగన్ వాంగ్మూలం ఇస్తే 90 శాతం కేసు పూర్తవుతుందని చెప్పారు. ఎన్నికలకు ముందే కేసు క్లోజ్ అయ్యేలా ప్రయత్నిస్తామన్నారు.
జైలు నుంచి ఇంటికి చేరిన కోడికత్తి శ్రీను- తన కోరిక ఏమిటంటే!
ఈ కేసు బెయిల్ కోసం తీవ్ర స్థాయిలో పోరాడిన విదసం కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థపై నమ్మకం లేదని ఎన్ఐఏ దర్యాఫ్తును జగన్ మోహన్ రెడ్డి కోరారని గుర్తు చేశారు. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తన దర్యాప్తులో స్పష్టం చేసిన నేపథ్యంలో, లోతైన దర్యాప్తు కావాలని మూడు సార్లు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.
దీనినిబట్టి చూస్తుంటే జాతీయ దర్యాప్తు సంస్థని సైతం జగన్ మోహన్ రెడ్డి నమ్మడం లేదని స్పష్టం అవుతందన్నారు. నమ్మకం లేని వారికోసం ప్రభుత్వ ఖర్చులు వృథా చేసి ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు. కాబట్టి ఫండమెంటల్ లాను అనుసరించి తక్షణమే ఎన్ఐఏ దర్యాప్తు నుంచి వైదొలగాలని కోరారు.
"బెయిల్ వచ్చిన తరువాత మొదటి సారి శ్రీను కోర్టుకు హాజరయ్యారు. శ్రీను చాలా దూరం నుంచి వస్తున్నారని గమనించి తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేశారు. ఈ కేసును విచారణ వేగంవంతం అయ్యేలా చేస్తాం. నేడు విచారణకు జగన్ మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది కూడా వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి కూడా వచ్చి వాగ్మూలం ఇవ్వాలని ఎన్ఐఏపై ఒత్తిడి తీసుకొస్తాం. ఎన్నికలల్లోపు శ్రీనుపై ఉన్న మచ్చని కడిగేస్తాం". - సలీమ్, శ్రీను తరఫు న్యాయవాది