Kadapa RTC Garage Flooded Due to Rains: ఓ మోస్తరు వర్షం కురిస్తే చాలు కడప ఆర్టీసీ బస్టాండు, గ్యారేజీ జలమయం అవుతున్నాయి. ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్నీ కడప గ్యారేజీలో మరమ్మతులు చేసుకోవాల్సి ఉంది. గ్యారేజీలోని వర్షపు నీరు బయటికి వెళ్లే దారి లేకపోవడంతో మోకాళ్లలోతు వరకు నిలిచిన మురికినీటిలోనే మెకానిక్‌లు మరమ్మతులు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కొత్త గ్యారేజీ పనులు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు.
ప్రయాణికులు బస్టాండ్‌లోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోజులు తరబడి అక్కడే నిల్వ ఉంటున్నాయి. ప్రయాణికులకు వేరే గత్యంతరం లేక ఆ నీటిలోనే నడుచుకుంటూ బస్టాండ్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. గ్యారేజ్‌లోకి మోకాళ్ల లోతు వరకు వర్షం నీరు చేరడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. మెకానిక్‌లు ఆ నీటిలోనే నిలబడి గంటల తరబడి పనులు చేయడం వల్ల కాళ్లు పగులుతున్నాయని వాపోతున్నారు.
2022లో కొత్త గ్యారేజ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపల గ్యారేజీ నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో పాత గ్యారేజ్‌లోనే కార్మికులు విధులు నిర్వహించాల్సి వస్తుంది. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారులు స్పందించి ఆర్టీసీ గ్యారేజ్‌లో వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మెకానిక్‌లు కోరుతున్నారు.
వర్షాకాలం వచ్చినప్పుడు ఈ మురుగునీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లోతుగా ఉండటం వల్ల నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేదు. దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాని బస్సులు సమయానికి తిరగాలి కాబట్టి వేరే దారిలేక నీటిలోనే పనులు చేస్తున్నాం. చిన్న వర్షం వచ్చినా గ్యారేజీలోకి మోకాళ్లలోతు నీళ్లు వస్తున్నాయి. ఎప్పడు చూసినా మురుగునీరు ఉంటున్నాయి. ఈ నీటిలో పనులు చేయడం వల్ల కాళ్లకు ఎలర్జీలు వస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని మేము పని చేస్తున్నాము.- మెకానిక్