Gundlakamma Project Gates Washed Away : వర్షాకాలం రాబోతుంది. వర్షాలు కురిసి వాగులు పారితే రిజర్వాయర్లలో నీళ్లు చేరతాయి. మరి చేరే నీటిని భద్రపరుచుకోడానికి సిద్దంగా ఉన్నారంటే యంత్రాంగం లేదనే చెపుతోంది. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ లోపం వల్ల రెండు గేట్లు విరిగిపోయి, కొట్టుకుపోయాయి. రైతులు, ప్రతిపక్షాలు గట్టిగా ఒత్తిడి తెస్తే ప్రభుత్వం గేట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓ గుత్తేదారుడు పనులు చేపట్టినా, అవి వర్షాకాలం నాటికి పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ కూడా వృథా అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు అంటున్నారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం చిన మల్లవరం వద్ద గుండ్లకమ్మ మీద నిర్మించి ప్రాజెక్టు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వరుసగా రెండు ఖరీఫ్ సీజన్లు వృథా అయ్యాయి. 3.8 టీఎమ్సీల సామర్థంతో నిర్మించిన జలాశయంలో ప్రతీ ఏటా 3.1 టీఎమ్సీల నీటి నిల్వలు పెట్టుకుంటారు. ఖరీఫ్‌లో సాగునీరు, దాదాపు 40 గ్రామాలకు సాగునీరు అందించేందుకు ఈ నీటిని వినియోగిస్తారు. దాదాపు 60వేల ఎకరాల సాగు అవసరాలను ఈ ప్రాజెక్టు తీర్చునుంది. ఇలాంటి ప్రాజెక్టుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరసగా రెండు సంవత్సరాలు రెండు గేట్లు కొట్టుకుపోయాయి. 15 గేట్లు ఉన్న స్పిల్ వే రెగ్యులేటర్‌లో దాదాపు అన్ని గేట్లు తుప్పుపట్టి శిథిలమయ్యే పరిస్థితి నెలకొంది.
మరో సారి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు-జలాశయాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం
గత రెండేళ్లూ గేట్లు కొట్టుకుపోవడం వల్ల నీటి నిల్వలు లేక జలాశయం ఒట్టిపోయింది. ప్రతిపక్షాలు, ఈ ప్రాంత రైతులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విరుచుకుపడటంతో 9 కోట్ల రూపాయలతో గేట్లు ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. పాత బకాయిలు చెల్లించడంలేదని, ఏ గుత్తేదారులు ఈ టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. పలుమార్లు టెండర్లు పిలవాల్సి వచ్చింది. చివరిగా గుజరాత్‌కు చెందిన ఓ గుత్తేదారు సంస్థ గేట్లు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఆరు నెలలు క్రితం పనులు ప్రారంభించినప్పటికీ అనేక అవరోధాలు కారణంగా పనులు మందకొడిగా సాగుతున్నాయని రైతులు అంటున్నారు. ఇప్పటికీ రెండు గేట్లు మాత్రమే ఏర్పాటు చేసారు. మూడోది ఏర్పాటవుతుంది. మరో నెల రోజుల్లో వర్షాలుకురిస్తే నీటిని భద్రపరుచుకోడానికి అవకాశం సన్నగిల్లుతున్నాయి.
గేట్లు విజయవాడ, గుజరాత్‌లో తయారు చేసి ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. ఇప్పటికి రెండు గేట్లు మాత్రమే పెట్టగా మూడో గేటు ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. అంటే మిగిలిన 12 గేట్ల పనులు పూర్తి చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఎగువ నుంచి వచ్చే నీరు సముద్రంలోకి వృథాగా పోతుందని రైతులు వాపోతున్నారు. గుండ్లకమ్మ కాలువలు, పిల్ల కాలువల నిర్వహణ కూడా వేసవిలో చేపట్టకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. గేట్లు కొట్టుకపోయిన వెంటనే పనులు ప్రారంభించినట్లయితే ఈ సమస్య ఉండేది కాదని రైతులు అంటున్నారు.
ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతుంటే మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారు: షర్మిల