Pension Distribution Issue In Andhra Pradesh : గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో ఒక్కో ఉద్యోగికి సగటున 74 మంది పింఛనుదారులు వచ్చారు. నగదు జమ గురించి భరోసానిచ్చిన వారికి డబ్బులు అందజేయడానికి మరో గంట, రెండు గంటల సమయం పట్టవచ్చు. లేదా రెండు రోజుల్లోనైనా పూర్తి చేస్తారు. పింఛనుదారుల వేలిముద్ర తీసుకుని పింఛను ఇవ్వడానికే అదనపు సమయం పడుతుంది. ఈ విషయాన్నే నెల రోజులుగా విపక్షాలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా మండుటెండల్లో వృద్ధులను బయటకు రప్పించే రాక్షస క్రీడను కొనసాగిస్తూనే ఉంది.
గత నెల 1న పింఛను పంపిణీకి ముందు సీఎస్ జవహర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో మెజారిటీ కలెక్టర్లు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛన్లు ఇవ్వవచ్చని ముక్తకంఠంతో చెప్పారు. ఈ సూచనను పెడచెవిన పెట్టి వైఎస్సార్సీపీకి వంతపాడేలా పింఛనుదారులను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించారు. ఇప్పుడు దానికి మించి బ్యాంకుల వద్దకు రప్పించేలా దారుణమైన ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లా అధికారుల ప్రయత్నంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఎంత సులువో ప్రస్తుతం నిరూపితమైంది. బ్యాంకుల్లో నగదు జమ కారణంగా ఎలాంటి ఆందోళనకు గురికావొద్దంటూ ఇళ్లకు వెళ్లి చెప్పాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సిబ్బంది సమాచారమిచ్చారని కాకుమాను ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు.
రాష్ట్రంలో 65.49 లక్షల మంది పింఛనుదారులుంటే 48.92 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మిగిలిన 16.57 లక్షల మంది ఇళ్లకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వాలి. సచివాలయాలవారీగా ఈ జాబితాలను ఇప్పటికే పంపారు. దాదాపు ప్రతి సచివాలయం పరిధిలోనూ ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సిన పింఛన్లు ఉన్నాయి. వీటిని అక్కడున్న పది మంది ఉద్యోగులు పంచుకుని ఇళ్ల వద్దకెళ్లాలని నిర్దేశించారు. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేసేవారికి ఇళ్లకు అటుఇటుగానే బ్యాంకుల్లో నగదు జమయ్యే పింఛనుదారులు ఉంటారు. అంత దూరం వెళ్లిన వారికి పక్కనుండే ఇతర పింఛనుదారులకు నగదు ఇవ్వడం కష్టమేమీ కాదు. ఎలాగూ సచివాలయ సిబ్బందిని ఇళ్ల వద్దకు పంపుతున్నారు. వారితోనే అందరికీ ఇప్పించవచ్చు.
ఏ అధికారి అయినా ప్రజలకు సమస్య వస్తే సులభ పరిష్కార మార్గం అనుసరిస్తారు. సీఎస్ జవహర్‌రెడ్డి మాత్రం వైఎస్సార్సీపీకి వంతపాడేలా పింఛను పంపిణీని ఎంత సమస్యాత్మకంగా మార్చవచ్చో అంతా చేస్తున్నారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ఒకవేళ సరిపడా సచివాలయ సిబ్బంది లేరని క్షణం అనుకున్నా ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసులున్నాయి. ఒకప్పుడు వీటి ద్వారానే ఇంటింటికీ అందించేవారు. ఈ విషయం సీఎస్‌కు తెలుసు కదా? పింఛనుదారుల పేరుపై మనియార్డర్ తీసి నేరుగా ఇళ్లకే నగదు అందించవచ్చు కదా? ఇబ్బంది పెట్టవద్దంటే ఇలాంటి మరెన్నో మార్గాలూ కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.