Government Neglected for AT Agraharam Road Works : గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారంలో చేస్తున్న రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. అంతేగాక ఈ రహదారిపై నిత్యం వాహనాదారులకు అవస్థలు తప్పటంలేదు . పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపిస్తోంది గుంటూరులోని ఏటీ అగ్రహారం రోడ్డు. ఈ రోడ్డును 80 అడుగులమేర విస్తరించేందుకు పనులు ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగడంలేదు.
నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు.. ప్రజలకు ఇబ్బందులు
ప్రస్తుతం మంచి నీటి పైపుల మరమ్మతులు, కాలువల నిర్మాణం జరుగుతోంది. తాగు, మురుగు నీరు రహదారి పైకి చేరి కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. రహదారి గుంతల్లో మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోందని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం భోజనాలు చేసేందుకు వీలు లేకుండా పోతోందని వాపోతున్నారు.
Extreme Delay of Road Works in Guntur District : పల్నాడు ప్రాంతం నుంచి ప్రజలు నగరంలోకి ఇదే మార్గంలో వస్తుంటారు. నిత్యం వేల మంది రాకపోకలతో రద్దీగా ఉండే ఏటీ అగ్రహారం ప్రధాన రహదారిని 1.5 కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించేందుకు నగరపాలక సంస్థ పనులు ప్రారంభించి దాదాపు ఏడాదిన్నరైంది. ఏటీ అగ్రహారంలో దాదాపు 18 లైన్లు ఉండగా ప్రధాన రహదారిపై కాలువ కట్టి అలా వదిలేశారు. చిన్నారులు, వృద్ధులు ఎక్కడ పడిపోతారో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. చుట్టుగుంట సెంటర్ నుంచి ఏటీ అగ్రహారం జీరో లైన్ వరకు చేపట్టిన విస్తరణ పనుల్లో ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గుంటూరు నగరంలో ఏటీ అగ్రహారం రోడ్డు దాదాపు 1.5 కి.మీ మేర పెద్దపెద్ద గుంతలతో ఏడాదిన్నరగా ప్రజలకు నిత్యం నరకం చూపిస్తోంది. హైదరాబాద్, ఒంగోలు జాతీయ రహదారి నుంచి నగరంలో పదుల సంఖ్యలో ఉన్న కాలనీలకు ప్రజలు ఈ మార్గం గుండానే వెళ్తుంటారు. ఇలాంటి రహదారి ఏడాదిన్నర క్రితం విస్తరణ పనులు మొదలుపెట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. గతంలో వర్షం నీరు, మురుగు నీరు ప్రస్తుతం మంచి నీటి పైపుల మరమ్మతుల కారణంగా తాగు నీరు ఇలా ఏడాది పొడవునా ఈ రహదారి గుంతల్లో నిలిచి మురుగు మయంగా మారుతోంది. నిత్యం ఇంత దారుణంగా ఉన్నా నిధుల మంజూరు అంతంత మాత్రంగా ఉండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
రహదారి విస్తరణ కోసం అడ్డుగా ఉన్న ఇళ్లు, దుకాణాలు తొలగించారు. అయినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు, పాలకులు త్వరతిగతిన విస్తరణ పనులు పూర్తి చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.