TDP Leaders Fire about EX CM Jagan Photo in Proddatur MunicipaL Office : ప్రభుత్వం మారినా అధికారుల తీరు మాత్రం మారలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫొటోలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పురపాలక కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఫొటోలను అలాగే ఉంచారు. దీంతో ప్రభుత్వం మారినా వారి ఫోటోలు ఎందుకు తొలగించలేదంటూ టీడీపీ నేత తలారి పుల్లయ్య కమిషనర్ రఘునాథ్ రెడ్డిని ప్రశ్నించారు. ఫోటోలు వెంటనే తీసివేయాలని లేదంటే ఆందోళన చేస్తామని పట్టుపట్టారు. దీంతో అధికారులు హుటాహుటిన వాటిని తొలగించారు. ఆ ఫొటోలు స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టించారు.
'జగన్మోహన్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫొటోలను తొలగించాలని ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ రోజు కూడా మరో రెండు రోజుల్లో తీసేస్తాం, వారం రోజుల్లో తీస్తాం అన్నారు. మేము ఆందోళన చేపడతామంటే సాయంత్రం వరకు వాటిని తొలగిస్తామన్నారు. అధికారులు ఇలా స్వామి భక్తి చూపడం దారుణం.' - టీడీపీ నేత తలారి పుల్లయ్య
YSRCP Colours And Jagan Photos To Government Buildings : గత అయిదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి నిత్యం పార్టీ రంగులు ఫొటోల పైనే దృష్టి పెట్టి సొంత డప్పు కొట్టుకునే పనే ధ్యేయంగా సాగారు. వైఎస్సార్సీపీ పార్టీ రంగులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రతీ ప్రభుత్వ భవనానికి నీలి రంగులు, జగన్ ఫొటోలతో హడావిడి చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా కొందరు అధికారుల తీరు అలాగే ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్సీపీ పార్టీ రంగులు, మాజీ మంత్రి చిత్రాలను మార్చే ప్రయత్నమే చెయ్యడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికిీ నేటికి కార్యాలయాలపై పార్టీ రంగులు చిత్రాలు దర్శనం ఇవ్వడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇక చేసేదేంలేక పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలే ఫొటోలు తొలగించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలోని రైతు భరోసా కేంద్రం భవనానికి వైఎస్సార్సీపీ రంగులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాలు దర్శనమిచ్చాయి. అధికారం మారినా కార్యాలయాలపై పార్టీ రంగులు చిత్రాలు దర్శనం ఇవ్వడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పాలన కంటే రంగుల పైనే ద్యాస పెట్టారంటూ ధ్వజమెత్తారు. ఈ రైతు భరోసా కేంద్రం ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఉన్నా అధికారులు రోజూ చూస్తూ తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది.