Crop Damage with Water Crises in Kakinada District : ఖరీఫ్‌లో పంట సాగు కలసి రాలేదు. కనీసం రబీలోనైనా అనుకున్న దిగుబడి సాధించి కొంతమేర అప్పుల భారం తగ్గించుకోవచ్చనుకున్న వరి రైతులకు నిరాశే మిగులుతోంది. మండుతున్న ఎండలకు తోడు సకాలంలో సాగునీరందక పొట్టదశలో వరిపైరు ఎండిపోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండంలోని గోదావరి డెల్టా శివారు గ్రామాల్లో సాగునీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయని కర్షకులు వాపోతున్నారు.
కొమ్మమూరు కాలువకు నిలిచిన సాగునీరు - ఎండిపోతున్న పంటలు
Crop Irrigation Problem : కాకినాడ జిల్లాలోని గోదావరి డెల్టా శివారు మండలమైన తాళ్లరేవులో పంట పొలాలకు సాగునీరు అందకు బీటలు పారుతూ ఎండిపోతున్నాయి. సాగునీరు అందక పొలం బీటలు వారి ద్విచక్ర వాహనాలు సైతం తిరిగేందుకు అనువుగా తయారైంది. మండలంలోని గ్రాంటు గ్రామ ఆయకట్టు పరిధిలో ఇప్పటి వరకు తీవ్రంగా వేధించిన నీటి కొరత, తాజాగా పోలేకూరు, మల్లవరం, గాడిమొగ, కోరంగి, తాళ్లరేవు తదితర గ్రామాలకూ విస్తరించింది. ఆయకట్టు పరిధిలోని సుమారు 1500 ఎకరాలకు 20 రోజుల నుంచి నీరందక పోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. రైతులు రబీలో వరి పంటకు వారాబందీ విధానంతో నీటిని అందిస్తున్నారు. పంట పొలాలకు 20 రోజుల నుంచి నీరు అందకపోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొ ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టమని, ఇప్పుడు సాగునీరు అందక పంట ఎండిపోతోందని కౌలు రైతులు వాపోతున్నారు.
నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు
వరి పంట పొట్ట దశలో ఉందని తప్పనిసరిగా తడులు అందిచాల్సిన తరుణంలో సాగునీటి సంక్షోభం తలెత్తిందని రైతులు వాపోతున్నారు. పంటకు మోటార్ల ద్వారా తడులు ఇచ్చేందుకు కాల్వల్లోనూ నీరు లేదని ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సాగు నీరు సౌకర్యం కల్పించాలని జనవనరుల శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో ద్వి చక్ర వాహనాన్ని నడిపి నిరసన తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చివరి ఆయకట్టు భూములకు సాగునీరందించాలని కోరుకుంటున్నారు.
" సాగు నీరు అందక వరి చేలు అన్ని ఎండిపోతున్నాయి. మోటారు ద్వారా పంటకు నీరు పెట్టుదాము అంటే కాలువల్లో చుక్కనీరు లేదు. వ్యవసాయ అధికారికి, కాలువ గుమస్తాకు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు. పంటకు రెండు, మూడు తడుల సాగునీరు అయితే ఫలితం ఉంటుంది. లేకుంటే పంటపై ఆశలు వదులుకోవాలి " _ తాళ్లరేవు రైతులు