Celebrities To Tirumala Tirupati Temple : తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి రాధిక, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, నటుడు, నిర్మాత అశోక్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సహా పలువురు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మరోవైపు తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కురిసింది. దీంతో చలితీవ్రత పెరిగింది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్లలోవాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గోగర్భం, పాపవినాశనం పూర్తిగా నిండి నీరు ఔట్ ఫ్లో అవుతోంది.
భారీ వర్షానికి తిరుపతి వీధులు జలమయమయ్యాయి. లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంటలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తోంది. వెస్ట్ చర్చి కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జి వర్షపు నీటితో నిండింది. అధికారులు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. బాలాజీ కాలనీ నుంచి మహిళా వర్సిటీ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. తిరుపతిలో మాల్వాడిగుండం జలపాతం పొంగిపొర్లుతోంది. కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా టీటీడీ భక్తులను నిలిపివేసింది.