Bail to Devi Reddy Shivashankar Reddy in YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఏపీలోకి ప్రవేశించొద్దని తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు ట్రయల్ ప్రారంభమైన తర్వాత ఏపీకి వెళ్లొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టు కోర్టుకు సమర్పించాలని, 2 లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని, ప్రతి సోమవారం హైదరాబాద్ సీసీఎస్‌లో హాజరు కావాలని, సాక్షులను బెదిరించొద్దని షరతు విధించింది.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని 5వ నిందితుడిగా చేర్చారు. 2021 సెప్టెంబర్ 17వ తేదీన శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శివశంకర్ రెడ్డి మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.
A5 Shivashankar Reddy Bail Hearing : వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులకు ప్రాణహాని ఉందని సీబీఐతోపాటు వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, ఇనయతుల్లా, వెంకటరమణ, జగదీశ్వర్‌రెడ్డి, తదితరులను బెదిరించినట్లు వాంగ్మూలాలు ఉన్నాయన్నారు. అవినాష్ రెడ్డి అనుచరుడైన శివశంకర్‌రెడ్డికి MLC టికెట్ ఇప్పించాలన్న ప్రయత్నాలు విఫలం కావడంతో వివేకా హత్యకు అందరూ కలిసి కుట్ర పన్నారని వివరించారు. శివశంకర్‌రెడ్డికి సన్నిహితుడైన గంగిరెడ్డి ద్వారా కుట్రను అమలు చేయించారని దాని కోసం 40 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందన్నారు.
మొదట శివశంకర్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారని ఇందులో సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి 75 లక్షలు అందజేశారని తెలిపారు. గతంలో శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని దర్యాప్తు పూర్తయిందన్న కారణంగా బెయిలు మంజూరు చేయరాదన్నారు.
YS Vivekananda Reddy murder case Updates: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్
వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డే గంగిరెడ్డి ద్వారా ఏర్పాట్లు చేశారని గతంలో సునీత తరపు న్యాయవాది స్వేచ్ఛ కోర్టుకు తెలిపారు. హత్య తర్వాత వాస్తవాలు బయటికి రాకుండా పోలీసు స్టేషన్‌లో ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. గూగుల్ టేక్ అవుట్ ప్రకారం హత్య జరిగిన సమయంలో శివశంకర్‌రెడ్డి అవినాష్‌రెడ్డి వద్దే ఉన్నారన్నారని తెలిపారు. పోలీసులు పిలిచిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్లాననడం వాస్తవం కాదన్నారు. గంగిరెడ్డి చెప్పింది చేయమని శివశంకర్‌రెడ్డి చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని వెల్లడించారు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తండ్రి షేక్ హాజీవలీపై ఇటీవల వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద దాడి చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌పై ఉండటం వల్లే తన తండ్రిపై దాడికి పాల్పడ్డారని దస్తగిరి ఆరోపించారు. వెంటనే ఆయన బెయిల్ రద్దు చేసే విధంగా న్యాయస్థానాలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.