APMDC Funding for YSRCP Govt Resurvey project : వైఎస్సార్సీపీ హయాంలో గందరగోళం గజిబిజి మేళంగా సాగిన భూముల రీసర్వే ప్రక్రియలో చిత్రవిచిత్రాలు బయటికొస్తున్నాయి. భూముల రీ-సర్వేతో సంబంధం లేని ఏపీఎండీసీ (APMDC) నుంచి ఏకంగా రూ.525 కోట్లు ఖర్చు చేశారు. సర్వేరాళ్ల కొనుగోలు నుంచి మొదలుకొని, వాటిని రవాణా చేసి, రాళ్లు పాతే ఖర్చునూ ఏపీఎండీసీతోనే పెట్టించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ప్రభుత్వం రీ-సర్వేను నిలిపేయడంతో కోట్లాది రూపాయల ఖర్చు ప్రశ్నార్థకమైంది.
ఓ ప్రభుత్వ కార్యక్రమం అమలు చేస్తుంటే దానికి అయ్యే వ్యయాన్ని సంబంధిత శాఖ ఖర్చుచేస్తుంది. కానీ జగన్ జమానాలో భూముల రీ-సర్వే విషయంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖకు బదులు అసలు సంబంధమేలేని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) కోట్లాది రూపాయల నిధులు ధారపోసింది. సర్వేరాళ్ల సరఫరాను ఆ సంస్థకు అప్పగిస్తే వాటికి రూ.525 కోట్ల రూపాయలను మంచినీళ్లలా వెచ్చించింది. మొన్నటి వరకు ఎండీగా ఉన్న వెంకటరెడ్డి సంస్థ అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం నిధులు ఎడాపెడా వాడేశారు.
'మీకోదండం మాకొద్దు మేడం'- భూరక్ష పథకం అమలు కోసం అధికారుల తంటాలు
భూముల రీ-సర్వేలో భాగంగా సర్వేపూర్తైన గ్రామాల్లో సర్వేరాళ్లు పాతాల్సి వచ్చింది. ఈ రాళ్ల తయారీ, సరఫరా బాధ్యత ఏపీఎండీసీకి అప్పగించారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని సర్వే, ల్యాండ్ రికార్డ్స్‌శాఖ వెచ్చించాలి. అయితే ఆ శాఖ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా ఏపీఎండీసీ మాత్రం రూ.75 లక్షల రాళ్లు సరఫరా చేసింది. సర్వేరాళ్లను కటింగ్, పాలిషింగ్ యూనిట్లలో కట్ చేయించి, దానిపై జగన్ పేరు చెక్కించింది. తర్వాత వాటిని సర్వేశాఖ చెప్పిన గ్రామాలకు రవాణా చేయించింది. వీటన్నింటికి కలిపి 400 కోట్ల రూపాయల మేర ఖర్చయింది. గ్రామాలకు సరఫరా చేసిన సర్వేరాళ్లను పాతేందుకు అయ్యే కూలీల ఖర్చులుగా 110 కోట్ల రూపాయలను ఏపీఎండీసీయే సర్వేశాఖకు ఇచ్చింది. అవి నేటికీ వెనక్కి రాలేదు.
చిత్తూరు 'పెద్దారెడ్డి' లీల - అధికారుల అండతో 982 ఎకరాలు కాజేశారు - YSRCP land irregularities
యూనిట్ల ఏర్పాటు పేరిట దోపిడీ : సర్వేరాళ్లను గ్రానైట్ మిల్స్ నుంచి తీసుకోకుండా ఏపీఎండీసీయే సొంతంగా నాలుగుచోట్ల కటింగ్, పాలిషింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలనుకుంది. చైనా నుంచి తెచ్చే యంత్రాలతో ఒక్కో యూనిట్‌కు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిసినా రూ.15 కోట్లే వ్యయమవుతుందంటూ అంచనాలు రూపొందించారు. అప్పటి ఎండీ వెంకటరెడ్డి, విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ప్రొక్యూర్‌మెంట్ విభాగం జీఎం బోస్ తెర వెనుక కథ నడిపారు. బోస్‌కు తెలిసిన కంపెనీలను రంగంలోకి దించి వాటికి టెండర్లు కట్టబెట్టారు. బల్లికురవ వద్ద రూ.15 కోట్లతో తొలి యూనిట్ ఏర్పాటుచేశారు. ఆ గుత్తేదారుకు 12 కోట్ల రూపాయలు చెల్లించారు. అనంతపురంలో మరో యూనిట్ పనులు కొంత వరకు జరగ్గా దీనికి 3 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. అయితే ఈ మిషనరీ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, విచారణలతో మిగిలిన యూనిట్ల ఏర్పాటు ఆగిపోయింది. వెంకటరెడ్డి మాత్రం అంతా నిబంధనల ప్రకారమే జరిగిందంటూ అక్రమాన్ని కప్పిపుచ్చారు. మొత్తానికి ఈ యూనిట్ల కోసం 15 కోట్లు ఖర్చు చేశారు.
అన్నివర్గాల నుంచి భూముల రీసర్వేపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రక్రియను నిలిపేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటించారు. దీంతో సర్వేశాఖ నుంచి ఏపీఎండీసీకి రావాల్సిన రూ.525 కోట్లు వెనక్కిరావడం ప్రశ్నార్థకంగా మారింది.