AP Government decision on GOs Uploading : వైఎస్సార్సీపీ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ (GOIR) వెబ్సైట్లోకి అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఆగస్టు 15వ తేదీ నుంచి 2024 ఆగస్టు 28వ తేదీ వరకూ గోప్యంగా ఉంచేసిన జీవోలన్నింటీని జీవోఐఆర్ (GOVERNMENT ORDERS ISSUE REGISTER) వెబ్సైట్లోకి అప్లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాల శాఖ (General Administration Department) కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు.
2008 నుంచి ఇచ్చిన జీవోలు ఉన్నాయన్న ప్రభుత్వం: ప్రస్తుతం జీవోఐఆర్ వెబ్సైట్ను పునరుద్ధరించటంతో పాత జీవోలన్నీ అప్లోడ్ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఉత్తర్వులనూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి గత మూడేళ్లు మినహా వెబ్సైట్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటి వరకూ అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ జీవోఐఆర్ వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15వ తేదీ నుంచి 2024 ఆగస్టు 28వ తేదీ వరకూ మాత్రమే ఉత్తర్వులు అందుబాటులో లేకుండా పోయాయని స్పష్టం చేసింది.
తెలంగాణ నుంచి వచ్చిన IASలకు పోస్టింగ్లు - ఆమ్రపాలికి ఏ శాఖ ఇచ్చారంటే?
సమాచార లోపం ఏర్పడుతోంది: పారదర్శకత, సమాచారం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు పౌరులకు అందుబాటులో ఉండాల్సిందేనని సాధారణ పరిపాలశాఖ పేర్కొంది. వాటన్నింటినీ అప్లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు. మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాచార లోపం ఏర్పడుతోందని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది. రహస్య జీవోలను 2 నెలల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆయా శాఖలకు సూచించారు.
ప్రభుత్వం అధికారిక నిర్ణయాలు జీవోల రూపంలో ప్రజలకు స్పష్టత ఇస్తాయని అభిప్రాయపడింది. సమాచార హక్కు చట్ట (Right to Information Act) ప్రకారం ప్రభుత్వ సమాచారం ఇవ్వాల్సి ఉన్నందున జీవోలు వెబ్‌సైట్‌లో ఉంచటం వల్ల సదరు అప్లిపేషన్లు కూడా తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. గడచిన మూడేళ్ల కాలంలో అప్లోడ్ కాని జీవోలను జీవోఐఆర్ వెబ్ పోర్టల్లో ఉంచాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల వ్యవధిలో ఆ మూడేళ్ల కాలానికి చెందిన జీవోలన్నీ అప్లోడ్ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచనలు జారీ చేసింది. జీవోలను అప్లోడ్ చేసే అంశంపై నివేదిక కూడా ఇవ్వాలని పేర్కొంటూ ఆదేశాల్లో స్పష్టం చేసింది.