AP Government Cheating Unemployed Youth: జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్ధి, ఉపాధ్యాయ నిష్పత్తిని అనుసరించి దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలపై కేంద్రం పార్లమెంటులో ప్రకటన జారీ చేసింది. 2023-24 సంవత్సరానికిగానూ ఉన్న ఖాళీలను కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక పాఠశాలల్లో 32 వేల 425 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 వేల 347 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. కానీ వేల సంఖ్యలో ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నా వాటిని ప్రకటించకుండా జగన్ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ ఇస్తామంటూ హామీ ఇచ్చిన జగన్, ఇప్పుడు కేవలం 6 వేల పోస్టులే ప్రకటించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
నూతన విద్యావిధానంలో భాగంగా విద్యార్ధి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో 25:1 గా ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో ఇది 30:1 గా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. జాతీయ విద్యా విధానం నిర్దేశించిన నిష్పత్తికి అనుగుణంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో ఉపాధ్యాయుల నియామకం ఆయా రాష్ట్రాలు చేపట్టాల్సి ఉందని కేంద్రం చెబుతోంది. కానీ రాష్ట్రంలో 6 వేల 100 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించటం ఆ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయటాన్ని నిరుద్యోగులు తప్పుబడుతున్నారు. టీచర్ల నియామకాల విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఖరి తమ పాలిట శాపంగా మారిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
'నాడు మెగా - నేడు దగా' - ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల ఆందోళన
"అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పోస్టులు ఉన్నాయి, ఇన్ని పోస్టులు ఉన్నాయి అంటూ చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం లేవు అని అంటున్నారు. దీనికి కారణం ఏమిటి. 60 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయస్సు 62కి పెంచి, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు పోస్టులు ఇవ్వకుండా మాపొట్ట కొడుతున్నారు". - నిరుద్యోగి
"ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 వేల పోస్టులు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 6 వేల 100 పోస్టులు మాత్రమే ఉన్నాయి, వాటినే భర్తీ చేస్తాం అంటున్నారు. ఈ అయిదు సంవత్సరాలు డీఎస్సీకి ప్రిపేర్ అవుతూ, ఏ జాబ్స్ కూడా చేసుకోలేకపోయాము. ఈ రోజున ఆరు జిల్లాలకు సున్నా పోస్టులు చూపిస్తుంటే, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలా మంది ఉండిపోయారు". - నిరుద్యోగి
"ప్రతి నెలా బటన్ నొక్కుతున్నా అంటున్నారు. ఇవాళ నిరుద్యోగులు అంతా బటన్ నొక్కేందుకు ఏకం అయ్యారు. మీకు రిటర్న్ బటన్ నొక్కేందుకు సమయం దగ్గరకి వచ్చింది. నిరుద్యోగులు అంతా కలిసి మిమ్మల్ని గద్దెదింపుతాము". - నిరుద్యోగి
దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ప్లీజ్- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు