AP CEO Notices to CM YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిబంధనలను ఉల్లంఘించి టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను తప్పుపడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వైఎస్ జగన్‌కు నోటీసులు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2, 3, 4 వ తేదీల్లో మదనపల్లె, పూతల పట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ పలు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హంతకుడు అని, ఆయనకు ప్రజలను మోసం చేయడం అలవాటని, శాడిస్ట్ అంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరుంధతి సినిమాలో పశుపతిలా తిరిగి వచ్చారంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై దురుద్దేశ పూర్వకంగా సీఎం వ్యాఖ్యలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, గీత దాటిన సీఎం జగన్‌పై వేటు వేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఈనెల 5వ తేదీన ఎన్నికల కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లనూ జత చేశారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, సీఎం జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ప్రాథమికంగా తేల్చారు. చేసిన వ్యాఖ్యలపై నోటీసు అందిన 48 గంటల్లో తమకు వివరణ ఇవ్వాలని తెలిపారు. నిర్దిష్ట గడువులోగా వివరణ రాకపోతే చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.