Allu Arjun Arrest in Sandhya Theatre Incident? : సినీ నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలోనే అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకోగా, అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్, అల్లు శిరీష్ వెళ్లారు. గురువారం దిల్లీలో పుష్ప-2 సక్సెస్ మీట్ ముగించుకుని అల్లు అర్జున్ హైదరాబాద్ వచ్చారు.
అదుపులోకి తీసుకున్న అనంతరం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంధ్య థియేటర్ ఘటనలో విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు.
పుష్ప-2 బెనిఫిట్ షో (Pushpa-2 Benefit Show Issue) సందర్భంగా ఈనెల 4వ తేదీన రాత్రి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ అనే రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో నిందితుల్లో ఒకరిగా గుర్తించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అరెస్టు అయ్యారు. సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ అసంతృప్తి: పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను తీసుకెళ్లడంలో తప్పు లేదని, పోలీసులు మరీ బెడ్‌రూమ్ వరకు వస్తారా అని ప్రశ్నించారు. తనను దుస్తులు కూడా మార్చుకోనివ్వలేదని తెలిపారు. ఇది మంచి విషయం కాదన్నారు.
Allu Arjun Petition : సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనపై అల్లు అర్జున్ ఈ నెల 11న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అత్యవసర విచారణకు యత్నాలు విఫలం: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ కోసం ఆయన న్యాయవాది ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర పిటిషన్‌గా విచారించాలని తెలంగాణ హైకోర్టును అల్లు అర్జున్ న్యాయవాది కోరారు. బుధవారం పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్‌పై పోలీసుల దృష్టికీ తెచ్చామని అల్లు అర్జున్ లాయర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
దీంతో పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని కోరారు. మ.1.30 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదని పీపీ అభిప్రాయపడ్డారు. సోమవారం వరకు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. పోలీసుల నుంచి వివరాలు సేకరించాక కోర్టుకు సమాచారం ఇస్తామని ప్రబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురు అరెస్టు
ఇదీ జరిగింది: ఈనెల 4వ తేదీన రాత్రి పుష్ప2 మూవీ ప్రీమియర్ షో జరిగింది. పుష్ప-2 ప్రీమియర్ షో కోసం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్దకు ఈ నెల నాలుగో తేదీ రాత్రి 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి, ఆయనని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భారీగా వచ్చిన అభిమానులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సమయంలో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందారు.
అల్లు అర్జున్ స్పందన : ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేయడంతో పాటు, పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్లో సైతం విచారం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. అదే విధంగా రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం ప్రకటించారు. గత 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నానని, ఇలా ఎప్పుడూ జరగలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, అదే విధంగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇదే ఘటనలో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. రేవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
'పుష్ప-2' బెనిఫిట్ షోకి వెళ్తే ప్రాణం పోయింది - సంధ్య థియేటర్ వద్ద మహిళ మృతి