25th Kargil Vijay Diwas Celebrations : కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ వద్ద కార్గిల్ విజయ్‌దివస్‌ను తూర్పునౌకాదళం నిర్వహించింది. విశాఖ కళాభారతిలో యాక్ మీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్‌లో కమిషనర్ శంకబత్ర బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్గిల్‌లో అసువులు బాసిన అమర వీరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు అంతర్జాతీయ పుస్తక రచయిత శ్రీధర్ బెవర కవితాగానంతో అంజలి ఘటించారు. 1999లో తాను రాసిన ఈ కవిత మాలికను స్వయంగా ఆలపించి అమరులైన భారత జవాన్లకు అంకితం చేశారు.
అమరవీరుల త్యాగాలు మరువలేనివి : కార్గిల్ విజయ్‌దివస్ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ సైనికుల సంఘం వారు ర్యాలీ చేశారు. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి ర్యాలీ చేశారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులను విజయనగరంలో ఘనంగా సత్కరించారు. సైనిక్ హిల్స్ వద్ద జరిగిన విజయ్‌దివస్ కార్యక్రమంలో 15 మంది సైనికులను, వీరమాతలను సత్కరించారు. జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు.
దేశ ప్రజలలో మార్పు వచ్చింది : శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25వ కార్గిల్ విజయ్‌దివస్ ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధం తర్వాత సైనికుల గురించి దేశ ప్రజలు ఆలోచించే తీరులో ఎంతో మార్పు వచ్చిందని రాష్ట్ర NCC గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ అన్నారు.
అక్కడ 3500 మంది యుద్దవీరులు : నెల్లూరు జిల్లాలో 3500 మంది మాజీ సైనికులు కార్గిల్ యుద్దవీరులు ఉన్నారు. ఈరోజు కార్గిల్ యుద్ద విజయం 25సంవత్సరాల ఉత్సవాలను జిల్లాలో నిర్వహించారు. జిల్లా సైనిక్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న భూమిని ఏడేళ్లుగా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నా గత ప్రభుత్వం భూమిని కేటాయించలేదని వాపోయారు. వింజమూరు, పొదలకూరు, ఉదయగిరిలో మాజీ సైనికుల భూములను కొందరు ఆక్రమించారని తెలిపారు.
రాబోయే తరాలకు స్ఫూర్తి : గుంటూరులోని అంబేడ్కర్ భవనంలో కార్గిల్ 25వ విజయోత్సవాలను నిర్వహించారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు ఎమ్మెల్యే గళ్లా మాధవి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తి సామర్థ్యాలతో పాటు మన నైతిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. దేశాన్ని రక్షించడానికి సాహసోపేతంగా పోరాడిన భారత సాయుధ బలగాల త్యాగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సైనికులకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. బలగాల ధైర్యం, భక్తి, త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తి దాయకమని చంద్రబాబు కొనియాడారు.
కార్గిల్ వీరుల త్యాగాలకు ఆర్మీ నివాళి- అనంతపురం చేరిన పాన్ ఇండియా బైక్ యాత్ర - Kargil Vijay Diwas