YSRCP Victims at Praja Darbar: ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. ఆ ప్రజలకు కష్టవస్తే ఆ ప్రభుత్వమే అండగా నిలవాలి. కానీ ప్రజాపాలనలో అమల్లోకి వచ్చాక ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సరైన వేదిక కనుగొనటమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది. ప్రజలకు దూరంగా, పరదాల చాటున దాగిన గత ముఖ్యమంత్రి విధానాలకు స్వస్తి పలికి ప్రజలతో మమేకమై వారికి సేవ చేయటం బాధ్యతగా పెట్టుకున్నారు చంద్రబాబు.
ఆ సమస్యలు విని అర్జీలు తీసుకునే వేదిక లేక ఇబ్బంది పడుతున్నారు. సచివాలయంలో ఈ విధానం ప్రారంభించాలనుకుంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి మళ్లీ సాయంత్రం లోపు తిరిగి వెళ్లి పోవాలనుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లకు దగ్గరగా ఉండే ముఖ్యమంత్రి నివాసం వద్ద అన్ని విధాలా అనువుగా ఉండే ప్రజా వేదిక లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
మదనపల్లి ఘటన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నాయకులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ వాళ్లు భూముల్ని కబ్జా చేశారు ఆదుకోండి అంటూ కొందరు. మూడేళ్ల బాబు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఆర్థికసాయం చేయండి అంటూ ఇంకొకరు. పాప ఇంజెక్షన్‌కు రూ.16 కోట్లు అవుతుంది సాయం అందించండంటూ మరొకరు. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితుల వినతులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
21వ రోజు మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ - సమస్యల సత్వర పరిష్కారానికి భరోసా - Nara Lokesh Praja Darbar
ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు నడి రోడ్డు, పార్టీ కార్యాలయం, సచివాలయం ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ సీఎం వినతులు తీసుకుంటున్నారు. మంగళగిరిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు మంత్రి నారా లోకేశ్ తొలుత ప్రజాదర్బార్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి నివాసానికి వచ్చేందుకు అనేక భద్రతా పరమైన ఇబ్బందులు ఉండటంతో తన నియోజకవర్గ ప్రజలకు అలాంటి ఇబ్బందులు లేకుండా అందరి నుంచి అందుబాటులో ఉన్నన్ని రోజులు వినతులు స్వీకరించాలని నిర్ణయించారు.
అయితే లోకేశ్‌కు మంగళగిరి ప్రజలతో పాటు ప్రతీరోజు రాష్ట్రం నలమూలల నుంచి పెద్దఎత్తున సమస్యలతో ప్రజలు పోటెత్తటం ప్రారంభించారు. దీంతో అందరి నుంచి వినతులు స్వీకరించటం ప్రారంభించి వచ్చిన వాటిని సంబంధిత శాఖలకు పంపే బాధ్యత లోకేశ్ తీసుకున్నారు. ఇలా మంగళగిరి ప్రజలకే పరిమితమైన ప్రజాదర్బార్ అన్ని ప్రాంతాల ప్రజల వినతులు మంత్రి లోకేశ్ స్వీకరించే వేదికగా సీఎం నివాసం మారిపోయింది.
లోకేశ్‌కు ఇచ్చిన వినతులు సత్వరం పరిష్కారం పొందుతుండటంతో అన్ని ప్రాంతాలవారూ ఉండవల్లి సీఎం నివాసానికే రావడం మొదలైంది. దీంతో భద్రతా పరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతిరోజు ఉదయం 400 నుంచి వెయ్యి మంది వరకూ ప్రజలు తన నివాసానికి వస్తుండటంతో సీఎం చంద్రబాబు కూడా వినతులు తీసుకుని వాటికి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. తన ఇంటి నుంచి సచివాలయానికి వెళ్తూ కూడా రోడ్డుపైనే ప్రజలు కనిపిస్తే కాన్వాయ్ ఆపి వినతులు తీసుకోవటం ప్రారంభించారు.
ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చి నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునేలా తన ప్రణాళికలో మార్పులు చేసుకున్నారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి రాష్ట్రం నలుమూలల నుంచి సమస్యలతో ప్రజలు పోటెత్తటం ప్రారంభించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన బాధితులతో పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. దీంతో వారానికి ఒకరోజు మాత్రమే వినతులు స్వీకరిస్తే సరిపోదని, ప్రతిరోజూ వినతుల స్వీకరణ జరగాలని సీఎం నిర్ణయించారు.
మంత్రులూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రోజూ ఓ మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి వినతులు స్వీకరించేలా వ్యవస్థను సిద్ధం చేశారు. మంత్రులతో పాటు సీనియర్ నేతలు కూడా నిత్యం అందుబాటులో ఉండి వినతులు తీసుకునేలా ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో కూడా ముందస్తు దరఖాస్తు చేసుకునే ఏర్పాటు కల్పించారు. మంత్రులు స్వయంగా పార్టీ కార్యాలయానికి వస్తుండటం, అధికారులతో నేరుగా మాట్లాడి ఫలానా సమస్య పరిష్కరించమని నేరుగా చెబుతుండటంతో బాధితులకు ఊరట లభిస్తోంది.
ఐదేళ్లుగా పార్టీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులను చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆరా తీశారు. చట్టపరంగానే వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై చర్చించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని కోరారు. తెలుగుదేశం నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైఎస్సార్సీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని ఇన్వెష్టిగేషన్ అధికారుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
కేసులు ఎదుర్కొంటున్న బాధితులు పార్టీ కార్యాలయానికి వస్తుంటే, మంత్రులు నేరుగా ఆయా జిల్లాల ఎస్పీలకు ఫోన్ చేసి విషయం ఆరా తీయటంతో వచ్చిన వారికి ఉపశమనం లభిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకుండానే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి 10వేలకు పైగా వినతులు వచ్చాయి. నారా లోకేశ్ ప్రజా దర్బార్‌కు అదే స్థాయిలో వినతులు పోటెత్తాయి. వచ్చిన వారి ప్రతీ సమస్యకు పరిష్కారంగా వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు.
ఫిర్యాదు ఏ స్థాయిలో ఉంది, పరిష్కారం అయ్యేందుకు కావాల్సిన అదనపు సమాచారం, తదితర వివరాలతో వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్‌లు వెళ్లే వ్యవస్థనూ పార్టీ ఏర్పాటు చేసింది. వినతుల పరిష్కారానికి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఓ సమన్వయ వ్యవస్థ ఉండేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు కల్పించారు. అటు ప్రజలు తమ సమస్యలను hello.lokesh@ap.gov.in మెయిల్‌కు పంపేలా లోకేశ్ చర్యలు తీసుకున్నారు.
తానే అందరి సమస్యలు నేరుగా చూస్తానని మంత్రి స్పష్టం చేశారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య, సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. అటు ముఖ్యమంత్రిని కలిసి నేరుగా వినతులు ఇచ్చేందుకు ముందుస్తు నమోదు కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 73062 99999ను ఏర్పాటు చేశారు. ముందుగా ఈ నెంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్య, వివరాలు అందచేసి నమోదు చేసుకుంటే వారు నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చే ఏర్పాటును పార్టీ చేసింది.
రాజధాని వరకు రాలేని వారికోసం కూడా ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు తమ క్యాంపు కార్యాలయాల్లో ప్రజాదర్బార్‌లను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయా మంత్రులు అధికారులను ఆదేశించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తున్నారు.
వినతుల్లో అధిక శాతం భూసమస్యలు, తాగునీరు, రహదారుల నిర్మాణానికి సంబంధించినవే ఉండటం గమనార్హం. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులకు ఇప్పుడిప్పుడే పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను కూడా త్వరగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.