TDP Chandrababu Naidu on Election Counting: విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఈ మేరకు తన నివాసంలో కలిసిన పార్టీ సీనియర్ నేతలతో గంటన్నరపాటు సమావేశం అవడంతో పాటు అంతకుముందు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లోనూ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, లెక్కింపు రోజు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎలక్షనీరింగ్ బాగా చేశామని, నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. శ్రేణుల పనితీరు పూర్తి సంతృప్తిని ఇచ్చిందన్నారు.
ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా బాగా కష్టపడ్డారని, మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉండి, పూర్తి సహకారం అందించారని కొనియాడారు. బీజేపీతో పొత్తు కూడా ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీ దాడులకు పాల్పడిందన్న చంద్రబాబు, దాడులకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, తెలుగుదేశంపై విషప్రచారం చేశారని మండిపడ్డారు. మాచర్ల, తాడిపత్రిల్లో ప్రారంభించిన హింస రాష్ట్రమంతటా సాగించాలని చూశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కుట్రల్ని ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కోవటంతో పాటు ఈసీ, ఇతర అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ వారి ఎత్తుగడల్ని భగ్నం చేశామన్నారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు - Chandrababu Teleconference
ముందు రోజు నుంచే పూర్తి అప్రమత్తంగా ఉండాలి: ఎన్నికల వరకు పడ్డ కష్టం ఒక ఎత్తైతే, కౌంటింగ్ రోజు మరో ఎత్తని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ ముందే ఓటమిని అంగీకరించిందని అన్న చంద్రబాబు ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ పార్టీ మూకలు కౌంటింగ్ రోజూ అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్న సమాచారం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ముందు రోజు నుంచే పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ రోజూ వైఎస్సార్సీపీ హింసాత్మక ప్రణాళికలను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. వైఎస్సార్సీపీ 35 సీట్లకే పరిమితమవుతుందనే ప్రచారం ఉందని నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, పోలింగ్ జరిగిన తీరు చూస్తే ఆ పార్టీకి అన్ని కూడా వచ్చేట్లు లేవని చెప్పారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ, డీజీపీకి లేఖలు రాయాలని పార్టీ నేతలకు సూచించారు.
ఈవీఎంలో నమోదైన ఓట్ల లెక్కింపులో పెద్ద సమస్యలు ఉండవన్న చంద్రబాబు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అత్యంత ముఖ్యమైందని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో 5లక్షల 40 లక్షల పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయని గుర్తుచేశారు. గత ఎన్నికలతో పోలిస్తే రెండున్నర లక్షలు అధికంగా పడ్డాయి కాబట్టి, సగటున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేలకు పైగా, లోక్‌సభ నియోజకవర్గంలో 22 వేల వరకు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు నమోదయ్యాయన్నారు. అవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనే భయంతోనే వైఎస్సార్సీపీ వాళ్లు వాటి కౌంటింగ్ ప్రక్రియపై సీఈవో, తెలుగుదేశంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీకి 35 సీట్లే వస్తాయంటున్న ఆ పార్టీ నేతలు - Chandrababu Naidu
సీఈవోను కలవాలని సూచన: గెలుపోటముల నిర్ణయంలో ఇవి కీలకం కాబట్టి, వీటిని నిరర్థకం చేసేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని, వీటిని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉన్నా యంత్రాంగం ఆ మేరకు చేయడం లేదని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. బుధవారం మధ్యాహ్నానికి మొత్తం 1,081 టేబుళ్లు ఏర్పాటు చేయడాల్సి ఉండగా కేవలం 633 మాత్రమే చేశారని చెప్పడంతో దీనిపై సీఈవోను కలవాలని చంద్రబాబు సూచించారు.
175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేవలం 122 మంది కౌంటింగ్ పరిశీలకుల్నే ఈసీ నియమించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలకు కలిపి ఒకే కౌంటింగ్ పరిశీలకుడ్ని నియమించడం ఏంటని ప్రశ్నించారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా, గెలిచిన అభ్యర్థి ప్రకటనలో కీలకంగా వ్యవహరించే కౌంటింగ్ పరిశీలకుల్ని తక్కువ సంఖ్యలో నియమించడం తగదని హితవు పలికారు.
94 నియోజకవర్గాలకు కేవలం 41 మందినే నియమించడాన్ని తప్పుబట్టారు. అంటే ఒక్కో పరిశీలకుడు రెండు నుంచి నాలుగు నియోజవకర్గాల్లో లెక్కింపును పరిశీలించాల్సి ఉంటుందన్నారు. వీటిలో కడప, పులివెందుల, కమలాపురం, తాడిపత్రి, వినుకొండ, బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు సహా పలు కీలక నియోజకవర్గాలు ఉన్నందున, వీటిని ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలని చంద్రబాబు నాయకులను ఆదేశించారు.