TDP Chandrababu Challenge to CM Jagan: 'సిద్ధం' సభలో జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావ్ అని రాప్తాడు అడుగుతోందన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి జాకీ పరిశ్రమ యజమాన్యాన్ని బెదిరించి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయటంవల్లనే, అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమ తరలిపోయిందన్నారు. ఈ పరిశ్రమను తరిమేసి ఆరువేల మంది మహిళల ఉపాధికి గండికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గ రైతులు, ప్రజలు వైఎస్సార్సీపీ అరాచకాలతో విసిగిపోయారని, వీళ్లను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
-
రాప్తాడు అడుగుతోంది.... జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని?
— N Chandrababu Naidu (@ncbn) February 18, 2024
అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని?
సీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని?
సమాధానం చెప్పి సభ పెడతావా.... సభలో సమాధానం చెపుతావా? @ysjagan#ApHatesjagan#JaganFailedCM pic.twitter.com/J1cUIfSF4v
జగన్‌కు అభ్యర్థులు దొరకడం లేదు- వై నాట్ పులివెందుల అనేదే మా నినాదం: చంద్రబాబు
దీంతోపాటు కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? అనంత అడుగుతోందని మండిపడ్డారు. కరువు నేలపై ఎవరూ ఊహించని విధంగా అనంతపురం జిల్లాపై తనకున్న ప్రేమతో కియా ప్రాజెక్టును తీసుకొస్తే.. ఇప్పుడది వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోందన్నారు. 6 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీరిచ్చామని తెలిపారు. రాళ్ల సీమలో కియా సిరులు పండిస్తోందిని, ఇదే టీడీపీ విజయమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పరిశ్రమలు వెల్లువలా వస్తే, సీఎం జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రావట్లేదని ధ్వజమెత్తారు. ఏపీ బ్రాండ్ వాల్యూను సీఎం జగన్ దిగజార్చారని మండిపడ్డారు.
అసలు సినిమా మొదలైంది - కాస్కో జగన్ రెడ్డి: చంద్రబాబు
నీటి వనరులు తక్కువగా ఉన్న రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంత రైతుల కోసం తెచ్చిన డ్రిప్ ఇరిగేషన్ పథకాలు ఎక్కడని? సీమ రైతన్న అడుగుతున్నారని చంద్రబాబు నిలదీశారు. రైతులకు భారీగా రాయితీలు ఇచ్చి వ్యవసాయదారులకు ఎంతో మేలు చేసే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయిందని గుర్తుచేశారు. త్వరలోనే డ్రిప్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు ప్రకటనలు చేసినా, ఆచరణలో కనిపించడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి సాయం అందటంలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వీటన్నింటికీ 'సమాధానం చెప్పి అనంతపురం రాప్తాడులో 'సిద్ధం' సభ పెడతావో లేకుంటే సభలోనే సమాధానం చెబుతావా జగన్? అని ప్రశ్నించారు.
"సిద్ధం సభలో జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాప్తాడు అడుగుతోంది.. జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని?. అనంత అడుగుతోంది.. కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని?. సీమ రైతన్న అడుగుతున్నారు.. నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని?. సమాధానం చెప్పి సభ పెడతావో.. సభలోనే సమాధానం చెబుతావా జగన్?" - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత