jagan join INDIA : ఇండియా కూటమిలో చేరేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఎన్డీఏ నేతలు అన్నారు. జగన్కు దిల్లీ స్థాయిలో ఓ పునరావాసం కావాలని, అదే సమయంలో ఇండియా కూటమికి కూడా పార్టీల అవసరం ఉందని వారు ఉదహరించారు. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అసెంబ్లీ లాబీల్లో యనమల, విష్ణుకుమార్ రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విడివిడిగా మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు.
ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగనుకు దిల్లీ స్థాయిలో ఓ పునరావాసం కావాలని, ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలని పేర్కొన్నారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీల నేతలు హాజరు కావడమే అందుకు సంకేతం అని వెల్లడించారు. ఇండియా కూటమిలో చేరడం జగన్కు అనివార్యం అని, ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు కాబట్టి ఎన్డీఏ కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి ఉందని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉండబోతున్నారని వెల్లడించారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం జగన్కు ఉందా? అని ప్రశ్నించారు. అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ మరో నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇండియా కూటమి లో చేరే ధైర్యమూ జగన్ కు లేదని ఎద్దేవా చేశారు. దిల్లీ వెళ్లి బీజేపీలో చేరాలనుకున్నారని, చేరిక ప్రయత్నాలు బెడిసికొట్టాయని తెలిపారు. పెద్దిరెడ్డి భూదందా బయటకు రాకూడదనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. ఒక మాజీమంత్రి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టించారు, మరో మంత్రి కాకాణి ఏకంగా కోర్టులో దొంగతనం చేయించారని ధ్వజమెత్తారు. నిందితులెవ్వరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని, ప్రతిపక్షంలో ఉండే దమ్ము, ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
జగన్ పాలనలో అకారణంగా హింసించి జైల్లో పెట్టారు: బాధితుడు - Allegations on YSRCP