CS Neerabh Kumar Review on Pensionsins AP : ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జులై 1న 65,18,496 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.4399.89 కోట్లను బ్యాంకులకు విడుదల చేసినట్లు సీఎస్ వివరించారు.
AP Pension Distribution Updates : ఈ క్రమంలోనే పింఛన్ నగదును ఇవాళ రాత్రిలోగా బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవాలని నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా ఏ బ్యాంకైనా డబ్బును ఈరోజు కనుక ఇవ్వకుంటే, ఆదివారం నాడు బ్యాంక్‌ను తెరిచి సంబంధిత నగదును ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు పింఛన్ల పంపిణీకి ఇతర శాఖల సేవలను కూడా వినియోగించుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీఓలకు తగు ఆదేశాలు జారీ చేయాలని నీరభ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.
జులై 1న (సోమవారం) ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాలని నీరభ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కలెక్టర్లు గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెన్షన్‌తో పాటు ముఖ్యమంత్రి లేఖను లబ్ధిదారులకు ఇవ్వాలని కలెక్టర్లను నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సామాజిక పింఛన్ల పెంపు రూ.4,000 జులై 1 నుంచే ఇస్తామని సర్కార్ పేర్కొంది. అంతకుముందు ఉన్న మూడు నెలల బకాయి కలిపి జులై 1న రూ.7,000 పంపిణీ చేయనుంది. దివ్యాంగులకు రూ.3000 పెంచి వచ్చే నెల నుంచి రూ.6000 ఇవ్వనుంది. కొన్ని రకాల వ్యాధుల బాధితులకు రూ.10,000 పెన్షన్ అందించనుంది.
మీ కష్టాలు చూసి చలించిపోయా - పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ - CM Chandrababu Open Letter
ఉదయం 6 గంటలకే: జులై ఒకటిన మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఫింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారoభించనున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్‌దారులకు 7వేల రూపాయలను సీఎం ఇవ్వనున్నారు. పెనుమాకలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65 లక్షల 18 వేల 496 మంది లబ్దిదారులకు 4 వేల 408 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.